చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి ..

29 Jun, 2019 07:03 IST|Sakshi

సాక్షి, కోడుమూరు(కర్నూలు) : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన కోడుమూరు పట్టణానికి చెందిన ఓ మహిళా భక్తురాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఈనెల 27న ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యమునోత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోడుమూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి రామచంద్రుడు భార్య ధర్మాంబ (65) నాలుగు రోజుల క్రితం చార్‌ధామ్‌ యాత్రకు బంధువులతో కలిసి వెళ్లింది. యాత్రలో భాగంగా ఈనెల 27న ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయంలో దర్శనం నిమిత్తం క్యూలో నిలబడిన ధర్మాంబ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది.

గమనించిన బంధువులు అక్కడే ఉన్న వైద్యుడిని సంప్రదించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ధర్మాంబ మృతదేహాన్ని కోడుమూరుకు తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ జిల్లా అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులతో మాట్లాడారు. శనివారం విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కోడుమూరుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మృతురాలికి భర్తతో పాటు, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు