నవలా రచయిత్రి కోగంటి కన్నుమూత

11 Mar, 2016 19:52 IST|Sakshi

గుడివాడ టౌన్ : ప్రముఖ నవలా రచయిత్రి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోగంటి రాజబాపయ్య కుమార్తె కోగంటి విజయలక్ష్మి(69) కన్నుమూశారు. గురువారం రాత్రి కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1946 జూలై 24న కోగంటి రాజబాపయ్య, శకుంతల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. 40 ఏళ్లకు పైగా నవలా రచయిత్రిగా ఆమె కీర్తి పొందారు. ఆమె రచించిన నవలలు పాఠకుల ఆదరణ పొందాయి.

ఆమె రచించిన నవలల్లో జ్వలిత, నా కవిత, మన్నించు ప్రియా, చక్రతీర్థం, చక్రవ్యూహం తదితర నవలలు ప్రాచుర్యం పొంది ప్రజామన్ననలందుకున్నాయి. ఆమె ఆయుర్వేద వైద్యురాలిగా కూడా సేవలు అందించారు. ది సొసైటీ ఆయుర్వేద గ్రామీణ వైద్య వెల్ఫేర్‌లో శిక్షణ తీసుకుని ప్రభుత్వ సర్టిఫికెట్ పొంది ఆయుర్వేద వైద్యం మొదలుపెట్టారు. ఆమె అవివాహితగానే జీవితం కొనసాగించారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఘననివాళులర్పించారు.

మరిన్ని వార్తలు