వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

13 Mar, 2018 11:42 IST|Sakshi
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో ఈవో, అర్చకులు

సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 18 న ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేసి.. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని జరిపారు.

ఆలయ మహద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించి.. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు