టీడీపీ వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత: కోలగట్ల

28 Sep, 2019 12:46 IST|Sakshi

సాక్షి, విజయనగరం: బాబు వస్తే జాబు అంటూ డాబులు చెప్పాడు.. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించలేని చంద్రబాబుకు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. పరీక్షల తర్వాత పేపర్‌ గోప్యత, కీ విడుదల వంటి తదితర అంశాలను పారదర్శకంగా నిర్వహిస్తే.. చంద్రబాబు అండ్‌ కో జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల మండి పడ్డారు.

సచివాలయ ఉద్యోగాల నిర్వహణలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయి.. నిరసన, ధర్నాలు చేయాలని పిలుపునిస్తే.. ఒక నిరుద్యోగైనా బాబుకు అండగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అసూయతోనే విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు అని డాబులు పలికి చివరకు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసేసిన ఘనత చంద్రబాబుదే అంటూ కోలగట్ల విమర్శించారు.

గత పాలకుల వల్లే ఇసుక కొరత..
తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల రూపాయలు ఇసుక దోచుకోవడంతోనే నేడు ఈ దుస్థితి అన్నారు కోలగట్ల. తమ ప్రభుత్వం యూనిట్‌ ఇసుకను అతి చౌకగా అందిస్తుందని తెలిపారు. గత పాలకుల ఇసుక దోపిడితోనే నేడు ఇసుక కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్‌ ఆటో, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే ఐఆర్‌ వంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హరికృష్ణ, కోడెల మరణాలను తన నీచ రాజకీయాలకు వాడుకుంటూ.. చంద్రబాబు శవరాజకీయాలకు దిగారని మండి పడ్డారు.

నియోజకవర్గంలో గత నాలుగు నెలలుగా వార్డ్ పర్యటన కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ వంద పనులను పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ‌చ్చే నెల అయిదున మంత్రి బొత్స చేతుల మీదుగా పలు పనులకు శంకుస్థాప‌న‌ మహోత్సవం చేపట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వీఎస్‌ ప్రసాద్ మంత్రి బొత్స ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నట్లు కోలగట్ల ప్రకటించారు.

మరిన్ని వార్తలు