సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?

18 Sep, 2017 20:01 IST|Sakshi
సిగ్గుపడాల్సిందిపోయి.. స్వాగతిస్తారా?

సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో తమ పార్టీ చెప్పిందే నిజమైందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తన మనుషులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు చేసిన కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. దేవుడి భూములనే దోచేయాలని చూశారని, నేటి వేలంపాట ధరతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు.

సదావర్తి భూముల వేలంలో అక్రమాలు బయటపడితే సిగ్గుపడాల్సిందిపోయి, స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సదావర్తి భూముల వేలంలో కుట్ర కోణంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదని విమర్శించారు.

నారాయణలో విద్యాసంస్థల్లో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావు, అవి యాజమాన్యం చేస్తున్న హత్యలని పార్థసారధి వ్యాఖ్యానించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.