ఆనందం

6 Feb, 2014 03:39 IST|Sakshi

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమితో కుంగి పోకుండా విజయానికి నాందిగా భావించాలని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు జరిగిన కోమటిరెడ్డి ప్రతీక్ స్మారక తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు మంచి తర్ఫీదుతో సాధన చేయాలన్నారు. పట్టుదలతో లక్ష్యసాధన కు కృషి చేస్తే విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించి గ్రామీణక్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానన్నారు.
 
 జేసీ హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ సమష్టికృషితో ముందుకు సాగితే విజయం తధ్యమని నిరూపించే క్రీడ హాకీ అన్నారు. ఎస్పీ డాక్టర్ టి. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీకి మనదేశంలో ఎంతో ఆదరణ ఉండేదన్నారు. ఒలింపిక్స్‌లో మనదేశం తరచూగా బంగారు పతకాలు సాధించిందని గుర్తుచేశారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా హాకీ జట్టు రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండేదని, ప్రస్తుత టోర్నమెంట్ నిర్వహణతో క్రీడాకారులను పునురుత్తేజం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ నీలకంఠం, హాకీ ఇండి యా జాయింట్ సెక్రటరీ ఎం.నిరంజన్‌రెడ్డి, డీఎస్‌డీఓ ఎండి.మక్బూల్ అహ్మద్, హాకీ నల్లగొండ అధ్యక్షుడు ఎం.గోపి, కార్యదర్శిజి. శ్రీనివాస్, ఇర్ఫాన్ అలీ, ఓవైస్‌ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.  వెటరన్ హాకీ క్రీడాకారులను సన్మానించారు.
 
 విజేతలకు బహుమతి ప్రదానం
 తెలంగాణ అంతర్‌జిల్లాల స్థాయి పురుషుల సీని యర్ హాకీ చాంపియన్‌షిప్‌ను నిజామాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బుధవారం నిజామాబాద్-నల్లగొండ జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదటి హాఫ్ హోరాహోరీగా సాగినా ఆ తరువాత నిజామాబాద్ జిల్లా జట్టు విజృంభించింది. చివరకు 4-1 గోల్స్‌తో విజయం సాధించింది. ఉదయం జరిగిన సూపర్‌లీగ్ పోటీల్లో నల్లగొండ జట్టు 2-0 గోల్స్ తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది. నిజామాబాద్ జట్టు 6-1 గోల్స్ తేడాతో వరంగల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. విన్నర్స్‌గా నిలిచిన నిజామాబాద్ జట్టుకు రూ.25వేల నగ దు, షీల్డ్‌ను అందజేశారు. అలాగే రన్నర్స్‌గా నిలిచిన నల్లగొండ జట్టుకు రూ. 10వేల నగదు, ట్రోఫి, తృతీయస్థానంలో నిలిచిన వరంగల్ జట్టుకు రూ.5వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు.
 
 ఉత్తమ క్రీడాకారులు
 టోర్నమెంటులో ఉత్త మ ప్రతిభ కనబర్చిన వివిధ జిల్లాల క్రీడాకారులకు వ్యక్తిగత బహుమతులు అందజేశారు.
 బెస్ట్‌గోల్ కీపర్ : జావీర్(నిజామాబాద్),
 బెస్ట్‌బ్యాక్ : ఆజం(నల్లగొండ)
 బెస్ట్‌హఫ్: శివకృష్ణ(వరంగల్)
 బెస్ట్ పార్వర్డ్ : సాగర్ (నిజామాబాద్)
 వెల్‌ప్లేయర్స్ జట్టు : కరీంనగర్
 

>
మరిన్ని వార్తలు