ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి

23 Oct, 2013 03:54 IST|Sakshi

ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కొమురం భీమ్ విగ్రహం మంగళవారం ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కేస్లాపూర్ కొమురం భీమ్ కమిటీ, సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్ ఆధ్వర్యంలో 73వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఉట్నూర్ ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝాలకు కేస్లాపూర్ గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజన యువత ఐక్యంగా ఉండి కొమురం భీమ్ ఆశయ సాధనకు కృషి చేయూలన్నారు. కాగా, గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అవి వస్తే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.

ఈ సందదర్భంగా గిరిజన నాయకులు సిడాం భీమ్‌రావ్, కనక తుకారం, కనక లక్కేరావ్ గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పోలీసు శాఖలో ప్రభుత్వం విడుదల చేస్తున్న ఐఏపీ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయూలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే గిరిజన యువకులు శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. రాయిసెంటర్ జిల్లా మెడి మెస్రం దుర్గు, మాజీ ఎంపీపీ కనక తుకారం, టీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యాదర్శి కనక లక్కేరావ్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, జాతీయ మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రాథోడ్, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్, కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్‌రావ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీమ్‌రావ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్జా యూకూబ్‌బేగ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు మధు, మాజీ ఎంపీటీసీ కినక జంగు, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్‌రావ్, అర్క ఖమ్ము పాల్గొన్నారు.
 
గిరిరాజులుగా బతకాలి
ఆదివాసీ గిరిజనులుగా కాకుండా గిరి రాజులుగా సమాజంలో గర్వంగా బతకాలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. కేస్లాపూర్‌లో భీమ్ వర్ధంతి కార్యక్రమానికి ముందుగా గిరిజనులు, గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు