పంట విరామం దిశగా కోనసీమ రైతులు

28 Jun, 2015 03:26 IST|Sakshi

తీరప్రాంత మండలాల్లో తరచూ ముంపు
 
 రాజమండ్రి : సాగు సమ్మె చేసి నాలుగేళ్లు కావస్తున్నా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడం, సాగు కష్టతరంగా మారడంతో ప్రస్తుత ఖరీఫ్ సాగుకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించేందుకు కోనసీమ రైతులు సిద్ధమవుతున్నారు. పెరిగిన పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం, కొద్దిపాటి వర్షానికే మురుగునీటి కాల్వలు పొంగిపొర్లడం, తీరప్రాంత మండలాల్లో సముద్రం పోటెత్తినప్పుడు చేలను ఉప్పునీరు ముంచెత్తి పంట నష్టపోవడం కోనసీమ రైతులకు పరిపాటిగా మారింది. తీరంలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి తదితర మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేయరాదనే నిర్ణయానికి వచ్చారు.

 నాలుగేళ్లు కావస్తున్నా అదే పరిస్థితి
 ధాన్యం దిగుబడి రికార్డుస్థాయిలో వచ్చినా కొనే దిక్కులేక నష్టపోయిన కోనసీమ రైతులు 2011లో సాగుసమ్మె చేశారు. ఈనిర్ణయం అప్పటి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేసింది. ఇది జరిగి నాలుగేళ్లు కావస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. సాగుచేసి నష్టాలను చవి చూసేకంటే వదులుకుంటే మేలనే అభిప్రాయం రైతులను పంట విరామానికి పురికొల్పుతోంది. సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం, మలికిపురం, మండలాల్లో గత ఏడాది 3 వేల ఎకరాల్లో సాగును రైతులు వదులుకున్నారు. ఈ ఏడాది కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. వీరికి మరికొన్ని గ్రామాల రైతులు తోడవడంతో కోనసీమలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో రైతులు పంటను వదులుకునే పరిస్థితి నెలకొంది. దీనిపై తీర మండలాల రైతు సంఘాల నేతలు, రైతులు సమావేశాలు ఏర్పాటు చేసి, పంట విరామమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.

>
మరిన్ని వార్తలు