‘కోండ్రు’పై.. జనం గాండ్రింపు

9 Apr, 2019 16:40 IST|Sakshi
నిర్లక్ష్యానికి ఆనవాలుగా పటువర్థనం గ్రామం

అభివృద్ధి పేరిట మాజీ మంత్రి అవినీతి

సొంతూరినే పట్టించుకోని వైనం

సాక్షి, శ్రీకాకుళం: కోండ్రు మురళీమోహన్‌..ఈ పేరు వినగానే అందరి మదిలోనూ ఒక్కటే మెదులుతుంది. అడ్డూ, అదుపూ లేని నోటి దురుసుతనం, నిర్లక్ష్యం, అహంకార వైఖరే గుర్తుకొస్తుంది. అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడిన తీరే జ్ఞాపకం వస్తుంది. అలాంటి వ్యక్తి పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చి రాజాం ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచారు. 2004లో ఎచ్చెర్ల నుంచి, 2009లో రాజాం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కోండ్రు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును దుమ్మెత్తిపోసిన కోండ్రును టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఆ పార్టీ నేతలు ససేమిరా అన్నారు. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నా అతి కష్టమ్మీద టికెట్‌ దక్కించుకున్నారు. గతంలో ఆయన వ్యవహార శైలిని చూసిన వారు, విన్న వారూ ఇప్పుడు అమ్మో.. కోండ్రు అంటూ గాండ్రిస్తున్నారు..!

2009లో ఎన్నికైన కోండ్రు మురళీమోహన్‌  మంత్రి అయ్యాక మరింతగా దూకుడు పెంచి నోటికి పని చెప్పారు. అధికారులపైనా  దుందుడుకుగా వ్యవహరించే వారు. తన వ్యతిరేకులపై కేసులు పెట్టించడం, జైలుకు పంపడం, వర్గాలను ప్రోత్సహిస్తూ అశాంతికి కారకులయ్యారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కోండ్రు మురళి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన సోదరుడు జగదీష్‌ కూడా అధికారులపై జులుం ప్రదర్శించే వారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కోండ్రును గెలిపిస్తే మళ్లీ అలాంటి రోజులే పునరావృతమవుతాయన్న ఆందోళన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అభివృద్ధి పేరిట అవినీతి
కోండ్రు మురళి మంత్రిగా పనిచేసిన సమయంలో అభివృద్ధి పేరిట అవినీతికి పాల్ప డ్డారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మంజూరైన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే.. రాజాంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు రోడ్డు విస్తరణ, బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరగలేదు.
వమ్మి–రుషింగి మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ వంతెనకు రూ.27 కోట్లు విడుదల చేశారు. 
రేగిడి, వంగర మండలాల్లో రూ.49 కోట్లతో 135 గ్రామాలకు అందించాల్సిన భారీ రక్షిత మంచినీటి పథకాలు పూర్తి కాలేదు. 
రూ.40 కోట్లతో నిర్మించాల్సిన రాజాం–రణస్థలం రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 
రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, వంగర మండలాల్లో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. రక్షిత మంచినీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. 
మడ్డువలస రిజర్వాయరు పునరావాస బాధిత గ్రామాల ప్రజలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ ఏడు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ ఇవ్వలేదు. 
ఈ నిర్వాసితులు ఇంకా తమ గ్రామాలను ఖాళీ చేయలేదు. రికార్డుల్లో తరలింపు గ్రామాలుగా చేర్చడంతో ఎలాంటి సదుపాయాలకూ నోచుకోవడం లేదు. ఈ బాధితులంతా ఏళ్ల తరబడి అక్కడే శిథిల ఇళ్లలోనే మగ్గుతున్నారు. 
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు.

సొంతూరినే పట్టించుకోలేదు.. 
కోండ్రు మురళి సొంతూరు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం లావేటిపాలెం. అమాత్యునిగా అందలమెక్కినా తన సొంతూరినే ఆయన పట్టించుకోలేదు. లావేటిపాలెంలో ఇప్పటికీ పారిశుద్ధ్య లోపం తాండవిస్తోంది. ఊళ్లో బోర్లన్నీ ఉప్పునీటినే ఇస్తాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరిప్పించండి మహాప్రభో..! అని గ్రామస్తులు ఏళ్ల తరబడి వేడుకున్నా మంత్రి హోదాలో ఉండి కూడా మనసు కరగలేదు. సొంతూరికి మంచినీళ్లే ఇవ్వలేని నాయకుడు తమ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తారని రాజాం నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు