కారొద్దు...డీజిల్‌ ముద్దు !

24 May, 2018 13:02 IST|Sakshi

కార్పొరేషన్‌ కారు తిరస్కరించిన మేయర్‌

డీజిల్‌పై మాత్రం ఆసక్తి

అదే దారిలో విభాగాధిపతులు

కార్పొరేషన్‌లో అన్నీ   సొంతకార్లే

‘నాకు పెద్దకారు కావాలి.. కనీసం రూ.30 లక్షలుండాలి.. అంతేతప్ప చిన్నా చితక కార్లు నాకొద్దు.. నాకు కార్లున్నాయి.. వాటిని వాడుకుంటా’.. అంటూ నగరంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న మేయర్‌ కోనేరు శ్రీధర్‌  కార్పొరేషన్‌ అందించే వాహనాన్ని కాదని తన సొంత కారులో నగర పర్యటనలకు హాజరవుతున్నారు... అయితే ఆ కారు తిరిగేందుకు పోసే డీజిల్, ప్రతి ఏడాది ఇన్సూరెన్స్‌ మాత్రం కార్పొరేషనే చెల్లిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ ఆదాయాన్ని మరింత పెంచాలి..ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా వ్యవహరించాలంటూ నిరంతరం తన కిందిస్థాయి సిబ్బందికి హితబోధ చేసే నగర ప్రథమ పౌరుడు మాత్రం కార్పొరేషన్‌కు భారీగానే కోతపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆయన వినియోగించే సొంతకారుకు కూడా కార్పొరేషనే ఇన్సూరెన్స్‌ చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలున్నాయి. నాలుగేళ్లుగా ఆయన కారుకు నగర పాలక సంస్థ ఇన్సూరెన్స్‌ చెల్లిస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం మేయరే కాదు... ఆయా విభాగాల ముఖ్య అధికారులు సైతం అదేదారిలో నడుస్తున్నారు. తమ సొంత వాహనాలను కార్పొరేషన్‌కు బాడుగకు పెట్టుకుని వ్యక్తిగత అవసరాలకు కూడా అదే కారును వినియోగిస్తున్నారని పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు.

నగర పాలక సంస్థ ఆదాయానికి గండి...
కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 30 మంది ఉన్నారు. వీరంతా సొంతకార్లను వినియోగించుకుంటూ వాటి ఖర్చులను మాత్రం కార్పొరేషన్‌ ఖాతాలో కలిపేస్తున్నారు. ప్రతి అంశానికి నిబంధనలు గుర్తుచేసే అధికారులు మాత్రం తమ సొంత వ్యవహారాల విషయంలో మాత్రం రూల్స్‌ తొక్కిపెడుతూ నగర పాలక సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల మేరకు అధికారులకు కేటాయించే కార్లు టాక్సీప్లేట్‌తో ఉండాలి. అందుకు విరుద్ధంగా అధికారులు వినియోగించే కార్లు మాత్రం వ్యక్తిగత పేరుతో రిజిస్ట్రేషన్‌ ఉన్న తెల్లప్లేటు కార్లే ఉన్నాయి. ఇదే అదునుగా ఆయా విభాగాల అధికారులు తమ సొంత కార్లను సైతం కాంట్రాక్టర్‌ పేరుతో ఏర్పాటు చేసుకుని బిల్లుల చెల్లింపులు చేసేసుకుంటున్నారు. ఒక్కో అధికారి కారుకు రూ. 25 వేలు వెచ్చిస్తున్నప్పటికీ టాక్సీప్లేట్‌ కాంట్రాక్టర్లు రావటంలేదని వివరణ ఇస్తున్నారు.

ఆర్టీఏ నిబంధనలకు వ్యతిరేకం....
సాధారణంగా అధికారులకు వారి పర్యటనలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్లు నిబంధన మేరకు టాక్సీ రిజిస్ట్రేషన్‌తోనే ఉండాలి. ఇది పసుపు రంగులో ఉంటుంది.  వ్యక్తిగత కారుకు మాత్రం తెలుపురంగు ఉంటుంది. అధికారులకు కేటాయించే కార్లు ప్రజాధనంతో తిరిగేవి కావటం, అలా ఉంటేనే కాంట్రాక్టర్‌ నుంచి ప్రభుత్వానికి మూడు నెలలకోమారు బ్రేక్‌ (వాహనం కండీషన్‌ ఉందీ లేనిదీ ఆర్టీఏ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి) చేయించాలి. ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి కొంత సొమ్ము ఫీజుల రూపంలో కట్టాల్సి ఉంది. నగర పాలక సంస్థలో అధికారులు వినియోగించే కార్లలో 90 శాతం కార్లు యాజమాని పేరుతో రిజిస్ట్రేషన్‌ ఉన్న కార్లే కావటం విశేషం. తెలుపురంగు రిజిస్ట్రేషన్‌ ఉన్న కార్లు వాణిజ్య వ్యవహారాలకు వినియోగించరాదు. ఇది ఆర్టీఏ నిబంధనల మేరకు చట్టవ్యతిరేకం కూడా. ప్రభుత్వం కూడా అలా తిరిగే కార్లకు బిల్లులు చెల్లించకూడదు. ఇలా చేస్తే చట్టరీత్యా నేరం అని నిపుణులు చెబుతున్నారు.   

కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు
నిబంధనల ప్రకారం అయితే అధికారులకు పెట్టే కార్లు టాక్సీప్లేట్‌ రిజిస్ట్రేషన్‌తోనే ఉండాలి. కానీ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్‌కు రూ. 25 వేలు మాత్రమే చెల్లించటంతో కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావటంలేదు. దీంతో ఓనర్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న కార్లకు అనుమతించాల్సి వచ్చింది. మేయర్‌కు మేం డీజిల్‌ మాత్రమే అందిస్తాం. అదీ పరిమితి లేకుండా. ఇన్సూరెన్స్‌ మాత్రం మాకు సంబంధం లేదు. ఆయన సొంతకారు కాబట్టి ఆయనే చెల్లించుకుంటున్నారు.– ప్రసాద్, వెహికల్‌ డిపో అధికారి

మరిన్ని వార్తలు