‘ప్రధాని పదవిపై చంద్రబాబు కన్ను’

21 Sep, 2017 20:21 IST|Sakshi
‘ప్రధాని పదవిపై చంద్రబాబు కన్ను’

సాక్షి, హైదరాబాద్: ఏపీలో తానొక్కరే పనిచేస్తున్నట్టు సీఎం చంద్రబాబు భావిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో కలెక్టర్లు కనీసం రేషన్‌ కార్డులు, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టు వినాలని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆదేశించారని ఆరోపించారు. ఏపీలో పనిచేయలేక అధికారులు కేంద్ర సర్వీసులకు వెళుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

అక్రమార్కులకు సీఎం కార్యాలయం అండగా నిలుస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులు ఇసుక నుంచి ఎర్రచందనం వరకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని సపోర్ట్ చేస్తూ కేసులు పెట్టొద్దని సీఎం పేషీ నుంచి మెసేజ్ లు వెళ్లడం దారుణమన్నారు.

అంకెల గారడీ చేయడంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సిద్ధహస్తుడని, దేశంలో ఎక్కడాలేని వృద్ధి రేటు ఏపీలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్రంలో జీడీపీ 5.6 మాత్రమే, ఏపీలో 11.7 జీడీపీ రేటుందని బాబు చెబుతున్నారు. బాబు పాలనలో అంకెల గారడీ ఏవిధంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. దీనిబట్టి చూస్తే ప్రధాని పదవిపై చంద్రబాబు కన్నేసినట్టుగా కనబడుతోందన్నారు.

మరిన్ని వార్తలు