-

ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తిన సీమాంధ్ర బంద్

13 Jul, 2013 05:15 IST|Sakshi
ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తిన సీమాంధ్ర బంద్

- కేంద్ర కోర్‌కమిటీ, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు
- టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇల్లు ముట్టడి
- పలుచోట్ల రహదారుల దిగ్బంధం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ శుక్రవారం విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ జేఏసీ నాయకులు చేపట్టిన సీమాంధ్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఏటీఎం సెంటర్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు సాయంత్రం వరకు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు చాలావరకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలతో సీమాంధ్ర జిల్లాలు హోరెత్తాయి. రాష్ట్ర విభజనయత్నాలకు కేంద్రం వెంటనే స్వస్తిపలకాలంటూ పలు జిల్లాల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కృష్ణాజిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల ఉద్యోగులు కూడా బంద్‌కు మద్దతు పలికారు. విజయవాడ నగరంలో హోల్‌సేల్ దుకాణాలన్నీ మూతపడ్డాయి. నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్దనున్న తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు నగరపాలకసంస్థ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో కార్పొరేషన్‌లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కొన్ని జిల్లాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి గ్రేటర్ ఆంధ్రప్రదేశ్‌గా చేయాలని విశాఖలో సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి డిమాండ్ చేస్తూ, ఈ మేరకు రూపొందించిన మ్యాప్‌ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు పంపించింది.

విశాఖనగరంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించగా, ఉద్యోగులు బంద్‌కు సహకరించారు. ఆటోవాలాలు, రిక్షా కార్మికులు సైతం బంద్‌లో పాల్గొన్నారు. కేంద్ర కోర్ కమిటీ దిష్టిబొమ్మను విద్యార్ధి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏయూ మెయిన్‌గేట్ ఎదుట దహనం చేశారు. విభజనయత్నాలకు నిరసనగా ఉభయగోదావరి జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వివిధ కళాశాలల విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. చిత్రాడ వద్ద పిఠాపురం మహారాజా వంతెనపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో 216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమలాపురంలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సభ నిర్వహించారు.

ఏలూరు వద్ద జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో గంటసేపు రాస్తారోకో, ధర్నా చేశారు. శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి నెహ్రూ బొమ్మ వరకు ప్రదర్శనగా వెళ్లారు. అక్కడ రాస్తారోకో చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ... వీఐపీ రోడ్, కోర్టు సెంటర్ మీదుగా చర్చిసెంటర్‌కు చేరుకుంది. చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌రేట్‌ను ముట్టడించి సమైక్యాంధ్ర అనుకూల నినాదాలు చేశారు.

రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో జేఏసీ నాయకులు ఎస్‌బీఐ పక్కనున్న సెల్‌టవర్‌ను ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించగా, పోలీసులు నచ్చజెప్పి కిందకు దింపారు. కదిరిలో వేర్పాటువాదులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ జిల్లా కడప యోగివేమన యూనివర్శిటీ విద్యార్థులు పూర్ణకుంభంతో కూడిన ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని సైకతశిల్పంగా రూపొందించారు. చిత్తూరులో సమైక్యవాదులు శుక్రవారం ఉదయం 5 గంటలకే పట్టణంలో వీధివీధి తిరిగి షాపులను మూయించారు. ఆందోళనకారులు 5 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పీలేరులో సుమారు 6వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రధాన కూడలిలో బైఠాయించారు. గంటకుపైగా కూర్చొని రహదారులను దిగ్బంధం చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సీటీలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి విడివిడిగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విద్యార్థులు కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించారు.
 

మరిన్ని వార్తలు