కొత్తపల్లి గీత ఎస్‌టీ కాదు...

27 Nov, 2016 02:00 IST|Sakshi
కొత్తపల్లి గీత ఎస్‌టీ కాదు...

హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
 
 సాక్షి, హైదరాబాద్: అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత ఎస్‌టీ (వాల్మీకి)గా పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి దానిని కొట్టేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా, శివలింగాపురానికి చెందిన శెట్టి గంగాధర స్వామి దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లతో పాటు కొత్తపల్లి గీత, కొత్తపల్లి వివేకానంద కుమార్, కలెక్టర్ అరుణకుమార్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కొత్తపల్లి గీత సోదరుడు కొత్తపల్లి వివేకానందకుమార్ ఎస్‌టీ కాదని తేల్చిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, గీత విషయంలో మాత్రం మరో రకంగా వ్యవహరిస్తున్నారని గంగాధరస్వామి తెలిపారు. గీత ఎస్‌టీ (వాల్మీకి)గా నిర్ధారించారని, పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె కొనసాగేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే కలెక్టర్ ఇలా రెండు వేర్వేరు వైఖరులను తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాను చెందని కులాన్ని తనకు ఏ వ్యక్తరుునా ఆపాదించుకుని, దాని కింద ప్రయోజనాలు పొందుతుంటే అటువంటి సమయాల్లో అధికరణ 226 కింద హైకోర్టులు జోక్యం చేసుకోవచ్చునని వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. కొత్తపల్లి గీత తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, తిమ్మాపురంలో 1971 ఫిబ్రవరి 2న జన్మించారని, ఆమె క్రిస్టియన్ ఆది ఆంధ్రా కులానికి చెందినవారని, అది బీసీసీ కేటగిరి కిందకు వస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు