కొత్తపల్లి గీతను పదవి నుంచి తొలగించాలి

24 Mar, 2016 23:13 IST|Sakshi

 సీతంపేట: అరుకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.వివేక్ వినాయక్, మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కో-కన్వీనర్ మాలువ సింహాచలం, గిరిజన జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆరిక మన్మథరావు ఆరోపించారు. గురువారం సీతంపేట వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గీత సోదరుడు ఎస్టీ కాదని ఇటీవల హైకోర్టు తీర్చు చెప్పిందని గుర్తు చేశారు.
 
  ఆమె కూడా ఎస్టీ కాదని, ఎంపీ పదవి నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆమెను పదవి నుంచి తప్పించి నిజాయతీ నిరూపించుకోవాలన్నారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారని, ఆమెకు మద్దతు పలికితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గిరిజన తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు తీసుకున్న గిరిజనేతరులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వచ్చేనెల 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 డిమాండ్లపై నిరసన ఉంటుందని తెలిపారు.  
 
 న్యాయం చేయకపోతే గిరిజనోత్సవాలు బహిష్కరిస్తాం...
 భామిని మండలం తాలాడ గిరిజనులకు న్యాయం చేయకపోతే వచ్చేనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న గిరిజనోత్సవాలను బహిష్కరిస్తామని గిరిజన ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గిరిజన భూములు ఆక్రమించుకున్న గిరిజనేతరులపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఐటీడీఏలకు నాన్ ఐఏఎస్‌లు ఉండడం వల్ల గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సమావేశంలో గిరిజన సంఘ నాయకులు కుండంగి కాంతారావు, వెంకటరావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు