అవినీతిని ఎండగట్టండి

28 Jul, 2015 02:14 IST|Sakshi

తాడేపల్లిగూడెం : టీడీపీ ప్రజాప్రతినిధుల అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ధన రెసిడెన్సీలో సోమవారం జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి అధ్యక్షత వహించిన సమావేశంలో కొత్తపల్లి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గడిచిన 14 నెలలుగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారన్నారు. ఉద్యోగ వర్గాలకు ఫిట్‌మెంట్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంపు జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.
 
  అన్నివర్గాల గురించి తపనపడే వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఈ విషయూన్ని రాష్ట్రంలోని ప్రజలు గుర్తించారని తెలిపారు. పార్టీ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయూలని కొత్తపల్లి సూచించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంక రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అవినీతిని పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైఎస్ హయాంలో యూనిట్ రూ.500కే లభ్యమైన ఇసుక నేడు రూ.2 వేలకు ఎందుకు చేరిందో వివరించాలన్నారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీపై కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
 
 నియోజకవర్గ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిడిగంటి మోహనరావు మాట్లాడుతూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిచ్చి కమిటీలను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తోట గోపి మాట్లాడుతూ అధికారంలో లేమని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.ఈతకోట తాతాజీ మాట్లాడుతూ రానున్న రోజులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు లంకా మోహనబాబు, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దింటకుర్తి లీలావతి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు సాయిబాబా తదితరులు మాట్లాడారు. సమావేశంలోపి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేటి చిట్టిబాబు, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల అధ్యక్షులు బాలం కృష్ణ, వల్లూరి బ్రహ్మానందం, పాల్గొన్నారు.
 
 నూతన కమిటీల ప్రమాణ స్వీకారం  
 పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన బొడ్డు సాయిబాబా, గూడెం మండల కమిటీ అధ్యక్షుడిగా బాలం కృష్ణ, పెంటపాడు మండల అధ్యక్షుడిగా వల్లూరి బ్రహ్మానందం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జాలాది సురేష్, బీసీ సెల్ అధ్యక్షుడిగా సంగాడి బాలాజీలు ప్రమాణం చేశారు.

మరిన్ని వార్తలు