కోటివరాల కల్పవల్లి

29 Mar, 2014 00:46 IST|Sakshi
కోటివరాల కల్పవల్లి
  • ఉత్తరాంధ్రుల ఇలవేల్పు ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
  •  నేటి నుంచి నూకాంబిక  కొత్త అమావాస్య జాతర
  •  నెలరోజులపాటు భక్త జనకోటికి వేడుకలు
  •  పోటెత్తనున్న లక్షలాది భక్తులు
  •  అనకాపల్లి, న్యూస్‌లైన్: అమ్మలగన్న అమ్మ, ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు శనివారం రాత్రి నుంచి మొదలవుతున్నాయి. అయిదు దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయానికి, జాతర మహోత్సవాలకు ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా నూకాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

    ఈ ఏడాది లక్షలాదిమంది పోటెత్తుతారన్న ఉద్దేశంతో ఆలయ సిబ్బంది నెలరోజుల నుంచే ఏర్పాట్లతో సిద్ధమయ్యారు.  గర్భాలయం, విగ్రహం, కల్యాణ మండపాలు, కాటేజీలు, అంతరాలయానికి రంగులు వేసి కొత్తసొబగులద్దారు. ఈనెల 29 తేదీ రాత్రి జరిగే జాతర నుంచి మొదలయ్యే ఈ మహోత్సవాలు ఏప్రిల్ 29 తేదీన  జరిగే నెల పండగతో ముగుస్తాయి. ఈనెల 30న కొత్త అమావాస్య పండగ, 31న ఉగాది నాడు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు.
     
    ఐదున్నర శతాబ్దాల చరిత్ర
     
    నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఐదున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. 1450లో నూకాంబిక అమ్మవారిని మొదటి కాకతాంబగా ప్రతిష్ఠించా రు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కళింగాంధ్ర ప్రభువైనా బాహుబళీంద్రుని ఓడించి అనకాపల్లి కేం ద్రంగా రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు.  గవరపాలెంగా వెలుగొందుతున్న ప్రాంతంలోనే ఒక శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించి తమ ఇలవేల్పు కాకతాంబ గుడిని కోటకు దక్షిణంగా నిర్మించారు.

    తరువాత కాలంలో అప్పలరాజు వంశీయులైన జగన్నాథరాజును పాయకరావుపేట వద్ద బ్రిటీష్ వారు ఓడించి ఉరి తీశారు. ఆ తర్వాత విజయనగరం రాజులను ఈ ప్రాంత పాలకులుగా బ్రిటీష్‌వారు నియమించారు. విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారిగా మార్పు చేసి కొలిచేవారు. తరువాత కాలంలో బోడి జగన్నాథరాజులు అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగరంరాజు నియమించారు.

    అనేక సంవత్సరాలు బ్రిటీష్ వారికి పన్నులు చెల్లించకపోవడంతో కోటను వేలం వేశారు. వైరిచర్ల ఆనందగజపతిరాజు వేలం పాటలో కోటను కొనుగోలు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈ వంశం వారే దేవాలయ శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. 1953లో నూకాంబిక అమ్మవారి దేవాలయం దేవాదాయశాఖ అధీనంలోకి వచ్చింది. 40 కాటేజీలు, క్యూకాంప్లెక్స్, కల్యాణ మండపం వంటి నిర్మాణాలతో ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలువైన నూకాం బిక అమ్మవారు రాష్ట్రంలో మహిమ గల దేవతగా ప్రసిద్ధిపొందారు.
     
     నూకాంబిక హుండీ లెక్కింపు


     అనకాపల్లిరూరల్: నూకాంబిక అమ్మవారి ఆల య హుండీ లెక్కింపు ఆలయ ఆవరణలో గురువారం రాత్రి చేపట్టారు. మొత్తం 16,54,411 రూపాలయిల నగదు, 14.300 గ్రాముల బం గారం, 670 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ చైర్మన్ బొడ్డేడ అప్పారావు, దేవాదయ శాఖ అదనపు కమిషనర్, ఈఓ ఎన్.సుజాత తెలిపా రు. రెండు నెలల కాలానికి ఈ ఆదాయం సమకూరిందని చెప్పారు. ఈ దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ గౌరీ, ఆలయ ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.
     
    వీఐపీ పాస్‌ల రద్దు


    అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల్లో వీఐపీ పాస్‌లు రద్దు చేసినట్లు దేవస్థానం ఈఓ సుజాత తెలిపారు. ఆలయ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జాతర మహోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని చెప్పారు. దేవస్థాన చైర్మన్ బొడ్డేడ అప్పారావు మాట్లాడుతూ ఉన్నతాధికారులు చేసిన సూచనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కోట్ని అయ్యన్నదొర, పలకా రాము, కామినేని ప్రసాద్, సూరిశెట్టి నర్సింగరావు, ఒమ్మి రాము తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు