రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది

12 Sep, 2019 12:14 IST|Sakshi
గుడపల్లి కాలువ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎమ్మెల్యే ప్రసన్న   

బాబు ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలమయం

పారదర్శకంగా వైఎస్‌ జగన్‌ వందరోజుల పాలన

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : మాజీ సీఎం చంద్రబాబుది రౌడీ రాజకీయమని, ఓటమిని జీర్ణించుకోలేక టెర్రరిస్ట్‌గా మారారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి బుచ్చిరెడ్డిపాళెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడి పాలనలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి యథేచ్ఛగా భూదందాలు, రౌడీయిజం సాగించారని ఆరోపించారు. తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడంపై రాష్ట్రమంతా నిరసన తెలిపినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోడెల శివప్రసాద్‌ వంటి రౌడీని శాసనసభకు స్పీకర్‌గా పెట్టిన ఘనత చంద్రబాబుదన్నారు.

శాసనసభ ఫర్నిచర్‌ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్న ఘనుడు కోడెల శివప్రసాద్‌ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వందరోజుల పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జీర్ణించుకోలేక శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు అన్ని జిల్లాల్లో వివాదాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గందరగోళం సృష్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. కులాల మధ్య చిచ్చురేపుతూ ఐదేళ్ల పాటు రౌడీయిజం చెలాయించాడన్నారు. టీడీపీ పాలనలో నరకయాతన అనుభవించిన ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నాడన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకపాలన అందిస్తున్నాడన్నారు. వందరోజుల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారన్నారు. వలంటీర్‌ వ్యవస్థ మొదలు సచివాలయ ఉద్యోగాల వరకు ఎందరికో ఉపాధి కల్పించారన్నారు. అటువంటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు నీకెక్కడిది చంద్రబాబూ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. 

రూ.68.81 లక్షలతోకాలువల అభివృద్ధి పనులు
బుచ్చిరెడ్డిపాళెంలో కాలువల అభివృద్ధి పనులకు కలెక్టర్‌ రూ.68.81లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.50లక్షలు విడుదల చేశారని చెప్పారు. మొత్తం రూ.1.20కోట్లతో కాలువ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గుడపల్లి కాలువ వద్ద కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు రూ.68.81లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం దళితవాడలో రూ.11.20లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం, రూ.14.50లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, రూ.53లక్షలతో నిర్మించిన ఐసీడీఎస్‌ కార్యాలయ భవనాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జునరావు, ఎంపీడీఓ నరసింహారావు, పంచాయతీరాజ్‌ ఏఈ శ్రీనివాసులురెడ్డి, ఇరిగేషన్‌ డీఈ మధు, ఏఈ వినయ్, ఎంఈఓ దిలీప్‌కుమార్, సీఐ సురేష్‌బాబు, ఎస్సై బలరాంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌ రెడ్డి, నాయకులు చీమల రమేష్‌బాబు, కలువ బాలశంకర్‌ రెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి,  టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, తిరువాయిపాటి నందకుమార్, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా