మాట్లాడుకుందాం... రండి

11 Oct, 2014 03:16 IST|Sakshi

* కొవ్వాడ రైతులకు కలెక్టర్ ఆహ్వానం
* వ్యతిరేకించిన సర్పంచ్‌లు, మత్స్యకారులు
రణ స్థలం: అణు విద్యుత్ కేంద్రంకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్‌లో నిర్వహించే సమావేశానికి హాజరుకావాల్సిందిగా మండలంలోని కొవ్వాడ, కోటపాలెం, అల్లివలస తదితర పంచాయతీలకు చెందిన గ్రామ పెద్దలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య రైతులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆహ్వానించారు. అయితే అందుకు వారు తిరస్కరించారు. వివరాలు ఇవీ... శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో తుఫాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన సమావేవంలో కలెక్టర్ మాట్లాడారు.

ఈ సమావేశానికి వచ్చిన కొవ్వాడ సర్పంచ్ మైలపల్లి పోలీసు, కోటపాలెం సర్పంచ్ సుంకరి ధనుంజయరావు, అల్లివలస మాజీ సర్పంచ్ మైలపల్లి వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకమని ఏళ్లతరబడి చెబుతున్నామని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రణస్థలం మండల పర్యటనలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం రద్దు చేయాలని వినతి పత్రం ఇస్తే తిరిగి అదే సమస్యపై మీరేమి మాట్లాడుతారని కలెక్టర్‌ని నిలదీశారు.

అంతగా అణు విద్యుత్ కేంద్రంపై మాట్లాడాలంటే జిల్లా అధికారులు, అణు విద్యుత్ అధికారులు కొవ్వాడ వచ్చి మాట్లాడితే ప్రజల సమస్యలు చెబుతారని అన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అణు విద్యుత్ కేంద్రం రద్దు అయితే ఫర్వాలేదని ఒకవేళ రద్దు కాకపోతే భూములకు ఏంత డబ్బు కావాలి, పునరావాసం ఎక్కడ కల్పించాలని, ఆర్‌ఆర్ ప్యాకేజీలో ఏంత కోరుతున్నారో చెబితే ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. కాగా ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్‌నాయుడు మాట్లాడుతూ ఈ సమస్య కొవ్వాడ పంచాయతీ ఒక్కదానిదే కాదని మండలంలోని సుమారు నాలుగు పంచాయతీలకు చెందిన సమస్యని అణు విద్యుత్ కేంద్రంపై సమావేశం స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావుని సంప్రదించి తెలుపుతామని, ఈ రోజు సమావేశం వాయిదా వేయాలని కోరారు.

మరిన్ని వార్తలు