అప్పు తెచ్చుకోండి... గ్యారెంటీ ఇస్తాం

31 Oct, 2017 03:30 IST|Sakshi

ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ సలహా

అప్పులు చేయాలని సలహా ఇచ్చేందుకు కన్సల్టెంట్లు  

బ్యాంకుల ద్వారా అప్పులు చేయాలని కేపీఎంజీ నివేదిక

ఆ సలహా ఇచ్చినందుకు రూ.2.23 కోట్లు చెల్లింపు

రహదారులు, వాటర్‌ రిసోర్స్‌ కార్పొరేషన్‌ల పేరుపై రూ.6000 కోట్లు అప్పు

ఆ నిధులను రహదారులు, జలవనరుల శాఖ కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లింపు

సాక్షి, అమరావతి:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపుల కన్నా అదనంగా బడ్జెట్‌ కావాలంటే అప్పు తెచ్చుకోండి... ఆ అప్పుకు గ్యారెంటీ ఇస్తామని చెబుతోంది రాష్ట్ర ఆర్థిక శాఖ. ఏ శాఖ ఏ కార్యక్రమానికి, ఏ పథకానికి అదనంగా నిధులు కావాలని అడిగినా ఆర్థిక శాఖ నుంచి ఇదే సమాధానం వస్తోందని పలు శాఖల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

జలవనరులు, రహదారులు–భవనాల శాఖలు చేపట్టిన పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులకు కూడా ఇదే విధానాన్ని ఆర్థిక శాఖ అమల్లోకి తీసుకువచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల పనుల అంచనాలను పెంచేయడం, నామినేషన్‌పై పనులు అప్పగించడం యధేచ్ఛగా కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు అవసరమైన నిధులకోసం కొత్త మార్గాన్ని అన్వేషించారు.

తొలి దశలో రహదారుల అభివృద్ధి సంస్థ, జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ల పేరుపై బ్యాంకుల నుంచి అప్పులు చేయనున్నారు. ఆ అప్పుల ద్వారా వచ్చిన నిధులను సాగునీటి కాంట్రాక్టర్లకు, రహదారులు–భవనాల కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. అంటే సొమ్ము ఒకరిది సోకు మరొకరిదనే చందంగా సాగుతోందని ఆయా శాఖల అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.  

అప్పుల సలహాలిచ్చేందుకు కన్సల్టెంట్లు
మరోవైపు అంతర్గతంగా ఆర్థిక వనరులను సమీకరించుకోవడంతో పాటు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ ఎలాగ చేయాలో సలహా ఇచ్చేందుకు కన్సల్టెంట్ల నియమకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అసలే అప్పుల భారంతో కునారిల్లుతున్న కార్పొరేషన్లకు అప్పులు ఎలా చేయాలో సలహా ఇవ్వడానికి రూ.కోట్లు చెల్లించి కన్సల్టెంట్లను నియమించడం హాస్యాస్పదంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఏ విధంగా నిధులను సమీకరించుకోవాలో చెప్పేందుకు కేపీఎంజీ కన్సల్టెంట్‌ను ఏడాది కాలానికి నియమించింది. ఆ సంస్థ ఏడాదిపాటు శ్రమించి... బ్యాంకుల ద్వారా అప్పులు చేసుకోవాలని సలహా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.23 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  


అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చెల్లింపులు
జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై తొలి దశలో రూ.3000 కోట్లు అప్పులు చేసేందుకు వీలుందని కేపీఎంజీ నివేదికను సమర్పించింది. ఆ మేరకు అప్పు చేసేందుకు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1000 కోట్ల మేర జలవనరుల అభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఆ అప్పు చేసిన నిధులను జలవనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. ఆ అప్పు చేసిన నిధులను సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుకు విడుదల చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సాగునీటి ప్రాజెక్టుల బిల్లులతో పాటు నీరు–చెట్టు పనులకు చెందిన బిల్లుల మొత్తం రూ.3000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. నీరు–చెట్టు కింద పనులన్నీ నామినేషన్‌పై చేశారని, వాటికి లెక్కా పత్రం లేకుండా ఉన్నందున ఆ బిల్లులు మినహా సాగునీటి ప్రాజెక్టుల పనులకు తొలుత బిల్లులు చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

అలాగే రహదారుల అభివృద్ధి సంస్థ రూ.మూడు వేల కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే రహదారులు అభివృద్ధి సంస్థ రూ.వెయ్యి కోట్ల అప్పు చేసింది. ఆ నిధులను రహదారులు పనులకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లిస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల తొలి అంచనాలు కాదని భారీగా పెరిగిపోతున్నాయని, దీంతో పాటు బడ్జెట్‌ కేటాయింపులకు మించి నిధులు కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలకు అప్పు తెచ్చుకోవడానికి అనుమతించామని, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పు చేయడానికి వీల్లేదని, అయితే గ్యారెంటీలు ఇవ్వడానికి అవకాశం ఉన్నందున సంస్థలు చేసే అప్పులకు గ్యారెంటీ ఇస్తున్నామని ఆ అధికారి వివరించారు.

మరిన్ని వార్తలు