అనుమతులు లేకుండా రావొద్దు..

3 May, 2020 18:41 IST|Sakshi

కోవిడ్‌ స్టేట్‌ లెవల్‌ కో ఆర్డినేటర్‌ కృష్ణబాబు

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లంతా spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి రావాలనుకుంటున్నవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని ఆయన తెలిపారు. రాజస్తాన్‌లో 9వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని.. వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్న మత్స్యకారులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రామిక్‌ రైళ్లలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని.. వలస కూలీలకు మాత్రమే పాస్‌లు ఇస్తున్నామని కృష్ణబాబు వెల్లడించారు.

రాజస్తాన్‌ మౌంట్‌ అబూలో 670 మంది వారు ఉన్నారని.. వారికి రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రత్యేక రైలు సిద్ధం చేసిందని తెలిపారు. ఏ రైలులో కూడా 1200 మందికి మించి ఉండరని తెలిపారు. వివిధ దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 10,500 మంది రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ఒక పద్దతి ప్రకారం పర్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సరిహద్దుల్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు, ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోలేని వారు తహశీల్ధార్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చని కృష్ణబాబు పేర్కొన్నారు.
(మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు