కృష్ణమ్మ చెంత.. దాహం కేకలు

7 Feb, 2016 03:09 IST|Sakshi
కృష్ణమ్మ చెంత.. దాహం కేకలు

కృష్ణమ్మ చెంత ఈ ఏడాది దాహం కేకలు తప్పేలా లేవు. వేసవి సమీపించకముందే ప్రకాశం బ్యారేజీ వద్ద నదినీటిమట్టం అడుగంటింది. జిల్లాలో చెరువులు కూడా ఎండిపోయాయి.దీంతో కృష్ణానది నీటిపై ఆధారపడేప్రాంతాలకు ఈ ఏడాది తీవ్ర తాగునీటిఎద్దడి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

 సాక్షి ప్రతినిధి, విజయవాడ : కృష్ణా నదిలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో పడిపోయాయి. తాగేందుకు కూడా నీరందించే పరిస్థితి లేదు. దీంతో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు కృష్ణా నీటి విడుదలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. నదిలో నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు చర్చించి మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు నాలుగు టీఎంసీల నీరు వదులుతున్నట్లు చెప్పినా ఇంతవరకు రాలేదు. పది రోజులు పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
పులిచింతలకు చేరింది 0.15 టీఎంసీలే. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు ఒక టీఎంసీ నీటిని వదలగా అందులో ప్రాజెక్టుకు ఇప్పటివరకు 0.15 టీఎంసీల నీరు మాత్రమే చేరిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాలువల్లో నీరు ఇంకిపోవడం, ఆవిరి కావడం, కొంతమంది కాలువపై మోటార్లు పెట్టి నీటిని మళ్లించటం జరుగుతోంది. దీంతో నీరు సక్రమంగా బ్యారేజ్‌కు చేరే పరిస్థితి లేదు.50 మిలియన్ గ్యాలన్లు అవసరం రోజుకు విజయవాడ నగరానికి 50 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం.

కార్పొరేషన్ అధికారులు ప్రజల కోసం తాగునీటిని కృష్ణా నది నుంచే తీసుకుంటున్నారు. ఇందులో 15 మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా
 పోతోందని సమాచారం. అంటే నగరంలో ప్రజలకు ఉపయోగపడుతున్నది కేవలం 35 మిలియన్ గ్యాలన్లే. దీంతో కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తాగునీరందటం లేదు. మోటార్లు సైతం నీటిని పైకి అందించలేకపోతున్నాయి. పైపుల్లో నీరు లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. గుంటూరు పట్టణ తాగునీటి అవసరాల కోసం కొంతమేరకు నీటిని గుంటూరు కెనాల్‌కు అందిస్తున్నారు. అందులో వారికీ పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి లేదు. సాగర్ నుంచి నీరు రాకుండా అందరికీ నీరందే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

 ఎన్‌టీటీపీఎస్‌కు నీరందేనా?
 ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)కు కృష్ణా నీటిని అందిస్తున్నారు. నదిలో నీటి మట్టం పూర్తిస్థాయిలో పడిపోవడంతో ఎన్‌టీటీపీఎస్‌కి కూడా నీటి సరఫరా ఆపివేసే పరిస్థితులు నెలకొన్నాయి. అదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో అనేక పట్టణాలు అంధకారంలోకి వెళతాయి. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
 ఎండిపోయిన చెరువులు...
 బందరు కాలువకు తాగునీటిని పూర్తిస్థాయిలో వదలాల్సి ఉంది. కేవలం కృష్ణా నీటిపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. కృష్ణమ్మను నమ్ముకొని తూర్పు కృష్ణాలో చాలా మంది బోర్లు కూడా వేయలేదు. జిల్లా వ్యాప్తంగా చెరువులు ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బందరు కాలువకు 1.5 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉంది. నదిలో నీరు అడుగంటుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు