అందుకే ఆ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి: కలెక్టర్‌ ఇంతియాజ్‌ 

26 Apr, 2020 13:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్లక్ష్యంతో ఉంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వృధానే అవుతుందన్నారు. ఆదివారం ఆయన సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం కలెక్టర్‌ ఇంతియాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణలంక, కార్మిక నగర్‌, ఖుద్ధూస్‌ నగర్‌ ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు చెప్పారు. ఒక్కోక్క వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్‌ సోకిందని విచారణలో తేలిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,500 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. 170 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. తాము చర్యలు తీసుకున్నా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు)

ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే ఊరుకోం 
లాక్‌డౌన్‌ వేళ ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ద్వారాకా తిరుమలరావు హెచ్చరించారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణలంక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడతామని చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగేకొద్దీ పోలీసులు చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాలని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం)

మరిన్ని వార్తలు