అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి కల సాకారం

26 Jul, 2019 14:45 IST|Sakshi
హౌసింగ్‌ కార్యాలయం

అనువైన భూముల కోసం గాలించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కలెక్టర్‌

జిల్లాలో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న 1,73,209 మంది

అర్హత నిర్ధారణపై గ్రామ, వార్డు వలంటీర్లతో సర్వే

అనంతరం జాబితాల రూపకల్పన

ఉగాదికి ఒకేసారి ఫ్లాట్ల కేటాయింపు

సాక్షి, మచిలీపట్నం: నిరు పేదల సొంతింటి కల సాకారం కానుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించింది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది.గడిచిన ఐదేళ్లలో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల మంజూరు పేరిట రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయి. కానీ అర్హులైన వారికి మాత్రం సెంటు జాగా కూడా దక్కలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లు, గృహరుణాలన్నీ తమ అనుయాయులకే ధారాదత్తం చేశారు. ఈ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి కల సాకారం చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అసెంబ్లీలో కూడా అధికారిక ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వాదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సైతం చర్యలు చేపట్టింది. జిల్లాలో అర్హుల జాబితాలను సిద్ధం చేస్తోంది.

గడిచిన ఐదేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇటీవల కొత్తగా ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో 1,73,209 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా విజయనగరం అర్బన్‌ పరిధిలో 61,720 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా నూజివీడు అర్బన్‌లో 9,807 దరఖాస్తులున్నాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏకంగా 1,07,246 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మచిలీపట్నం డివిజన్‌లో 19,638 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం అందుతున్న దరఖాస్తులన్నింటిని మాస్టర్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారిలో అర్హులెవరైనా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారో గుర్తించాలని సూచించారు. అందిన దరఖాస్తుదారుల్లో అర్హులెంతమంది ఉన్నారో గుర్తించేందుకు త్వరలో అందుబాటులోకి రానున్న గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేయాలని నిర్ణయించారు. మరొక వైపు అర్హులైన వారి కోసం అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో అనువైన స్థలాల గుర్తించాలని ఆదేశించారు. అర్బన్‌లో ఎకరాకు 100 మంది, రూరల్‌లో ఎకరాకు 40 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఏయే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా డిమాండ్‌ ఉంది? ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎంత భూమి అవసరం ఉంటుంది. సేకరించేందుకు ఎక్కడైనా అనువైన భూములున్నాయా వంటి వాటిపై కార్యాచరణ రూపొందించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనపై జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పదిరోజుల్లో మండలాల వారీగా నివేదికలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతు న్నారు.

మరిన్ని వార్తలు