విద్యాశాఖలో డెప్యుటేషన్‌ల గోల..!

25 Jul, 2019 11:38 IST|Sakshi
మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం

అడ్డగోలు సర్దుబాట్లు..

అవసరం లేకున్నా ఉపాధ్యాయుల కొనసాగింపు

ప్రభుత్వం మారినా, తీరుమార్చుకోని అధికారులు

డీఈఓ పూల్‌లో 53 మంది ఎదురుచూపులు

డ్యూటీ సర్టిఫికెట్‌ల సమర్పణలో ఇబ్బందులు

సాక్షి, మచిలీపట్నం: ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం జిల్లా విద్యాశాఖలో కుదిపేస్తోంది. పాఠశాలల్లో అవసరం అనే పేరుతో కొంతమంది ఉపాధ్యాయులకు డెప్యుటేషన్‌ పేరిట ఇస్తున్న వర్క్‌ ఆర్డర్‌లు ఎవరికోసమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి  పదోన్నతుల్లో భాగంగా కొత్తగా ఉపాధ్యాయులు వచ్చి చేరినప్పటకీ, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని ఇంకా అదే చోట కొనసాగిస్తుండటం విద్యాశాఖ పనితీరును ఎత్తిచూపిస్తోంది.

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై, విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నప్పటకీ, జిల్లా విద్యాశాఖలో ఇంకా పాత విధానాలే అమలు అవుతున్నాయి. నూతన ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ నియామకాలు, పదోన్నతుల పర్వానికి పచ్చజెండా ఊపారు. ఇదే క్రమంలో జిల్లా విద్యాశాఖలో ఎస్జీటీల నంచి స్కూల్‌ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందారు. దీంతో జిల్లాలో సుమారుగా 330 సెకండరీ గ్రేడ్‌ (ఎస్జీటీ) టీచర్‌ పోస్టులు ఖాళీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. డీఈఓ పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే  పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సర్దుబాట్లు చేయాలనే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా వచ్చిన ఆదేశాలతో డీఈఓ కార్యాలయ అధికారులు అడ్డదారులకు తెరతీసినట్లుగా విమర్శలొస్తున్నాయి. 

పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు..
విద్యార్థులు లేరనే సాకుతో టీడీపీ ప్రభుత్వం 2017లో చేపట్టిన రేషనలైజేషన్‌లో భాగంగా కొన్ని పాఠశాలలు పడగా, 53 మంది ఉపాధ్యాయులను పోస్టింగ్‌లు లేకుండా గాల్లో(డీఈఓ పూల్‌లో) ఉంచారు. అయితే జిల్లాలో ఖాళీ స్థానాల్లో వీరికి పోస్టింగ్‌ ఇవ్వగా, కొంతమందిని అవసరాల పేరుతో మరో పాఠశాలల్లో విధులు నిర్వహించేలా సర్దుబాటు చేశారు. వేతనాలు పొందేందుకు ఇదే వారికి సమస్యగా మారింది. డ్యూటీ సర్టిఫికెట్‌ ఎవరు ఇవ్వాలనే దానిపై స్పష్టత లేకపోవటంతో చాలా మందికి సకాలంలో వేతనాలు రాని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలను మూసి వేసేందుకు శ్రద్ధ చూపిన అప్పటి టీడీపీ ప్రభుత్వం వీరికి శాశ్వత పోస్టుల్లో నియమించేందకు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవటంతో శాశ్వత పోస్టింగ్‌ కోసమని వీరికి రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పలేదు. 

ఇవేం సర్దుబాట్లు..
పదోన్నతులు ఇచ్చి ఇరువై రోజులకు పైగానే అవుతుంది. కానీ చాలా చోట్ల డెప్యుటేషన్‌లపై గతంలో పనిచేసిన వారు ఇంకా కొనసాగుతున్నారు. గతంలో సర్దుబాట్లు పేరుతో విద్యాశాఖాధికారులు చేసిన డెప్యూటేషన్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ తాజాగా అడ్డగోలు డెప్యుటేషన్‌లకు తెరతీస్తున్నట్లుగా తెలిసింది. అవసరం అనే సాకును చూపి డీఈఓను సైతం మాయజేసి, ఇక్కడి కొంతమంది సిబ్బంది చేస్తున్న పనులు పాలనకు మచ్చతెచ్చిపెడుతుంది.

  •  మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెంలో పీఈటీ ఉండగా, ఇటీవల ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుకు ఉపాధ్యాయుడు వచ్చారు. కానీ ఇక్కడ ఇంకా అదే స్థానంలో సీఆర్‌పీని   కొనసాగిస్తున్నారు .
  •  గూడూరు మండలం మళ్లవోలులో పీడీ, పీఈటీ ఉన్నారు. ఇక్కడ వలంటీర్‌ ఉన్నారు.   
  •  పెనుమలూరు మండలం యనమలకుదరు బీసీ కాలనీ స్కూల్లో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఒక్క పోస్టులో ఏడాది కాలంగా ముగ్గురు ఎస్జీటీ  ఉపాధ్యాయులు డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. 
  • రామవరప్పాడు మెయిన్‌ పాఠశాలలో ఎనిమిది పోస్టులకు గాను, ప్రస్తుతం ఏడుగురు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి పాఠశాల నిర్వహణకు ఇబ్బందేమీ లేకపోయినా ఓ ఉపాధ్యాయురాలిని డెప్యూటేషన్‌పై నియమించారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి బంధువు కావటం గమనార్హం. 
  • కలిదిండి మండలం భాస్కరరావు పేట జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి ఫిజికల్‌ సైన్సు బోధన కోసమని కాటూరుకు డిప్యుటేషన్‌పై నియమించారు. ఇటీవల పదోన్నతుల్లో కాటూరు పోస్టు భర్తీ అయింది. కానీ గతంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అదే చోట ఇంకా కొనసాగిస్తున్నారు. 

డీఈఓ పూల్‌లో ఉన్న వారికి న్యాయం చేయాలి
డీఈఓ పూల్‌లో ఉన్న వారిని శాశ్వత పోస్టుల్లో వెంటనే నియమించాలి. అవసరం లేని చోట సర్దుబాటు పేరుతో ఇచ్చిన డెప్యుటేషన్‌లను రద్దు చేయాలి. ఉపాధ్యాయులు ఎక్కడ అవసరమనేది పక్కాగా గుర్తించి సర్దుబాట్లు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యాశాఖాధికారులు దానిపై దృష్టి పెట్టాలి.
 –ఎస్‌పీ మనోహర్, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

సబ్జెక్టు టీచర్‌లను బోధనకే ఉపయోగించాలి
సబ్జెక్టు టీచర్‌లను కార్యాలయ పనుల కోసమని డెప్యుటేషన్‌లను వేయటం సరైంది కాదు. విద్యార్థులకు మేలు చేసే పనులకు సంఘం మద్దతు తెలుపుతాం. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నాం.
 –మిర్జా హుస్సేన్, వైఎస్సార్‌ టీఎఫ్‌ ,రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు

వివరాలను పరిశీలిస్తున్నాం
పాఠశాలల వారీగా ఖాళీలు, డిప్యుటేషన్‌లపై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను తెప్పించుకుంటున్నాం. వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని జిల్లాలోని డెప్యూటీ డీఈఓ, ఎంఈవోలందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవసరం మేరకే డిప్యుటేషన్‌లు వేస్తున్నాం. డీఈఓ పూల్‌లో ఉన్న వారందరికీ శాశ్వత పోస్టులను కేటాయించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది. 
–ఎంవీ రాజ్యలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు