నిత్యావసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు

23 Mar, 2020 16:25 IST|Sakshi

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు

సాక్షి, విజయవాడ: ప్రజల అవసరాలను వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు హెచ్చరించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మెడికల్‌ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నామని.. ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించారు. నిత్యావసరాల దుకాణాలకు సైతం ఉదయం 10 గంటల వరకే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. (తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు)

మద్యం దుకాణాలను మూసివేయాలి
‍​‍కృష్ణా జిల్లా: ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణ నివారణలో భాగంగా జిల్లాలో 144 సెక్షన్‌తో పాటు లాక్ డౌన్ అమలులో ఉన్నందున  ప్రభుత్వ మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, కల్లు దుకాణాలు నేటి నుండి 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. (కరోనా కట్టడికి మేము సైతం..) 

పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన పోలీసులు
కైకలూరు: లాక్ డౌన్ నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ పరిధిలో ముదినేపల్లి మండవల్లి కలిదిండి మండలాల్లో 144 సెక్షన్ అమలవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర షాపులు మినహా అన్ని దుకాణాలను పోలీసులు మూయించి వేశారు. కైకలూరులో హోటళ్లు మూత పడటంతో పేదలకు 100 భోజన ప్యాకెట్లను కైకలూరు టౌన్‌ పోలీసులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్‌ స్టేడియాన్ని పరిశీలించిన అధికారులు
తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కేంద్రమైన తిరువూరులో 100 పడకల ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడానికి మున్సిపల్‌ స్టేడియాన్ని రెవెన్యూ, వైద్య అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఆదేశాలతో మున్సిపల్‌ స్టేడియాన్ని తక్షణమే అందుబాటులో తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, కొండూరు, తిరువూరు మండలాల ప్రజలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు