కలలా వారధి

11 Aug, 2015 04:22 IST|Sakshi
కలలా వారధి

నేటికీ ప్రారంభంకాని కృష్ణానదిపై వంతెన పనులు
వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు నిర్మాణం
రూ. 1940 కోట్ల వ్యయంతో టెండర్ అప్పగింత
30 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు
ఏడాది పూర్తవుతున్నా పునాదికి నోచని వైనం

రెండు జిల్లాలకు వారధి....
మూడు కిలోమీటర్లకు పైగా వంతెన...
దాదాపు రూ.1940 కోట్ల వ్యయం...
టెండర్ అప్పగించి ఏడాది. నేటికీ పనులు ప్రారంభి ంచని సంస్థ...కిమ్మనని ప్రభుత్వం...
రాజధాని ప్రాంతంలో ప్రజల ఎదురు
తెన్నులు..నిర్మాణం పూర్తవుతుందా లేదా...
ప్రారంభమే లేని చోట కార్యరూపం
దాల్చ గలదా అనే సందేహం...
చివరకు ప్రారంభానికి నోచని ప్రాజెక్టుగా
మిగులుతుందా అనే అనుమానం..!

తాడికొండ:
అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు గత ఏడాది ప్రభుత్వం మంజూరు చేసిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం నేటికీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది సెప్టెంబరులో తుళ్లూరు మండలం వెంకటపాలెం 6/0 కిలోమీటరు వద్ద నుంచి కృష్ణాజిల్లా గొల్లపూడి వద్ద కృష్ణానదిపై 3 కిలోమీటర్ల 100 మీటర్ల పొడవ ునా వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1940 కోట్లతో టెండరు పిలిచింది. గామన్‌ఇండియా సంస్థ ఈ టెండరును దక్కించుకుంది. 30 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ నేటి వరకు పనులే ప్రారంభించలేదు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు మొదలు పెట్టలేదని సమాచారం.

దీనిపై నేషనల్‌హైవే అధికారులు సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఆస్ట్రేలియా కంపెనీతో కలసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తిరుగు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆస్ట్రేలియా కంపెనీ దేశంలో ఇప్పటికి 9 చోట్ల ఇటువంటి వంతెన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. దీంతో ఆ కంపెనీతో కలసి పనిచేసేందుకు గామన్ ఇండియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  వంతెన నిర్మాణానికి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు 90 శాతం భూములు కూడా ఇచ్చారు. నిర్మాణ వ్యయం రూ.1940 కోట్లలో రూ.300 కోట్లు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించారు. కొందరు రైతులు మాత్రం భూసమీ కరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. వారికి సంబంధించిన ప్యాకేజీ కూడా ఉన్నతాధికారుల వద్ద డిపాజిట్ చేశారు. అయితే నేటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు.
 
మాస్టర్ ప్లాన్‌లో మరో రెండు వంతెనలు
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మరో రెండుచోట్ల కృష్ణానదిపై వంతెనలు నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం నుంచి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి నుంచి చెవిటికల్లు వరకు వంతెన నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మాణాలు చేపడితే గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు తప్పుతాయి.

>
మరిన్ని వార్తలు