పుష్కరాలకు అమరావతి బ్రాండ్

28 Mar, 2016 02:34 IST|Sakshi
పుష్కరాలకు అమరావతి బ్రాండ్

రాజధాని ప్రాచుర్యానికి ప్రభుత్వ వ్యూహం
ద్యానబుద్ధ, అమరలింగేశ్వర
ఆలయం వద్ద ప్రత్యేక ఘాట్లు
ఎండిపోయిన కృష్ణానది
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల మల్లగుల్లాలు

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కర ఘాట్లన్నీ నీళ్లు లేక వెలవెలపోతున్నాయి. ఇదే పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగితే పుణ్యస్నానం కాదు కదా.. కనీసంజల్లు స్నానం కూడా దక్కదేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.నీటి లభ్యతపైపెద్దఎత్తునచర్చజరుగుతున్నా పట్టించుకోని సర్కారు.. పుష్కరాలపై రాజధాని అమరావతి ముద్ర వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అయినా ఘాట్ల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.  
 


 
సాక్షి, విజయవాడ బ్యూరో : గోదావరి పుష్కరాలప్పుడు నదుల అనుసంధాన ప్రచారాన్ని ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం.. కృష్ణా పుష్కరాల్లో రాజధాని అమరావతి బ్రాండ్‌ను ప్రయోగించాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే పాత అమరావతితోపాటు ఏపీ రాజధాని అమరావతికి పుష్కర ఏర్పాట్లలో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలను రాజధాని ప్రాంత బ్రాండ్ ఇమేజ్‌కు ముడిపెట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అమరావతిలోని 125 అడుగుల ధ్యానబుద్ధ సమీపంలో భారీ ఘాట్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు చేరువలోనే పంచారామ క్షేత్రమైన అమరేశ్వరాలయం ఉండడంతో ఆ రెంటినీ కలిపేలా భక్తుల కోసం  ఘాట్లను సమకూర్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు లేనందున పుష్కరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయం వరకు నిర్మించే ఘాట్ వరకు నీరు వచ్చేలా చిన్న పాయ (కాలువ) తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఏడాది పొడవునా ప్రత్యేకంగా తవ్వే కాలువలో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ నదిలోకి నీరు రాకపోతే పుష్కర స్నానం ఎలాగని భక్తులు మధనపడుతున్నారు. ప్రత్యేకంగా కాలువ తవ్వేందుకు అమరేశ్వరస్వామి ఆలయ సమీపంలోని నదిలో ఉన్న కొండలు అవరోధంగా మారనున్నాయి. దీనికితోడు ఆగస్టు నాటికి నీరు విడుదలైతేనే పుష్కర స్నానం దక్కుతుందని, లేకుంటే తుంపర స్నానమే దిక్కని భక్తులు భావిస్తున్నారు.

 వినియోగం కాని నిధులెందుకో!
పాత అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేయడంతో కేంద్రం విడుదల చేసే నిధులతో పుష్కరాల నాటికి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతోనే పుష్కరాలకు అమరావతికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రెస్ట్‌రూమ్‌లు, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకు నిబంధనలు అడ్డువస్తాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి కేంద్రం ఎంపిక చేసిన హెరిటేజ్ సిటీల్లో అమరావతి ఒక్కటే గ్రామం కావడంతో దీనికి నగరస్థాయి కల్పించాలన్నా సాంకేతిక సమస్య ముడిపడి ఉంది.

అమరావతి డెవలెప్‌మెంట్ అథారిటీ ఏర్పడినప్పటికీ హెరిటేజ్ సిటీ ఆగ్‌మెంటేషన్ అండ్ డెవలెప్‌మెంట్ యోజన (హెఆర్‌ఐడీఏవై) ద్వారా వచ్చే నిధులను పుుష్కర ఏర్పాట్లకు ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే విడుదలైన రూ.23 కోట్ల నిధులు అనేక సాంకేతిక సమస్యలతో వినియోగంలోకి రాలేదు. దీంతో హెరిటేజ్ నిధులతో పాత అమరావతిలో పనులు చేపట్టాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
 
రూ.400 కోట్లతో వెంకన్న ఆలయం

మరోవైపు రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో పలు నమూనా దేవాలయాల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు నమూనా దేవాలయాలను చూసేందుకు రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నది సర్కారు యోచన. దీంతోపాటు వెంకటపాలెం-రాయపూడి ప్రాంతాల్లో రూ.400 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనున్న బాలాజీ టెంపుల్‌కు పుష్కరాల నాటికి శంకుస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్థల అన్వేషణ సాగుతోంది. ఇలా పాత అమరావతి ప్రాంతంతోపాటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంతో పుష్కరాలను ముడిపెట్టి బ్రాండ్ ఇమేజ్‌పై బహుళ ప్రాచుర్యం కల్పించేలా వ్యూహరచన చేయడం కొసమెరుపు.

>
మరిన్ని వార్తలు