కృష్ణమ్మ వరద నష్టపరిహారం రూ.11.11కోట్లు

11 Sep, 2019 11:12 IST|Sakshi

కృష్ణా వరదల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఉదారంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ కంటే 15శాతం అదనంగా పరిహారం ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాక్షి, అమరావతి : పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన వరదలు ఏకంగా వారం రోజుల పాటు కొనసాగడంతో నదీ పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో వేలాది మంది రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వరదల అనంతరం అధికారులు దాదాపు 15 రోజుల పాటు ప్రత్యేక బృందాలతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి.. 33 శాతానికి మించి వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని తుది అంచనాలను రూపొందించారు. 

ఇదీ పరిస్థితి..
జిల్లాలో 11 మండలాల్లో 2,423 మంది రైతులకు చెందిన 1,426 హెక్టార్లలో రూ.2.06 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 14 మండలాల్లో 7,051 మంది రైతులకు చెందిన 4021.872 హెక్టార్లలో రూ.7.60కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చారు.

పత్తికి పెద్ద దెబ్బ
వ్యవసాయ పంటల్లో పత్తికే అపార నష్టం వాటిల్లింది. చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికచర్ల మండలాల్లో 960.596 హెక్టార్లలో పత్తిపంట దెబ్బతిన్నట్టుగా అధికారులు లెక్క తేల్చారు. ఆ తర్వాత పెనుమలూరు, మోపిదేవి, కంకిపాడు, తొట్లవల్లూరు మండలాల్లో 141.811 హెక్టార్లలో చెరకు, 11 మండలాల్లో 134.986 హెక్టార్లలో వరి, 82.369 హెక్టార్లలో మొక్కజొన్న, 67.971 హెక్టార్లలో మినుము, 18.438 హెక్టార్లలో పెసలు, 12.339హెక్టార్లలో ఉలవ పంట దెబ్బ తిన్నట్టుగా గుర్తించారు. మరో ఐదు రకాల పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. కాగా స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ కింద ఈ పంటలకు రూ.2కోట్ల 6లక్షల 38వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని అంచనావేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం అదనంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించడంతో ఆ మేరకు రూ.2 కోట్ల 37 లక్షల 33వేల 700లు చెల్లించాలని లెక్క కట్టారు.

ఉద్యాన పంటలకు అపార నష్టం
వ్యవసాయ పంటల కంటే ఉద్యానç పంటలకే అపార నష్టం వాటిల్లింది. తోట్లవల్లూరు, మోపిదేవి, చల్లపల్లి, పమిడిముక్కల, ఇబ్రహీంపట్నం, పెనుమలూరుతో సహా ఇతర మండలాల్లో 843.682 హెక్టార్లలో అరటి, తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, పెనుమలూరు, కంచికచర్ల తదితర మండలాలో 1,665.908 హెక్టార్లలో పసువు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, చల్లపల్లి, పెనుమలూరు మండలాల్లో 678.514 హెక్టార్లలో కంద పంట.. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, కంచికచర్ల మండలాల్లో 5,84,312 హెక్టార్లలో కూరగాయల పంటలు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, పమిడిముక్కల, కంచికచర్ల మండలాల్లో 89.6 హెక్టార్లలో బొబ్బాయి.. చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లో 89.648 హెక్టార్లలో మిరప.. తోట్లవల్లూరు, అవనిగడ్డ, పెనుమలూరు, కంచికచర్ల మండలాల్లో 14.59 హెక్టార్లలో జామ.. తోట్లవల్లూరు, కంకిపాడు, పెనుమలూరు మండలాల్లో 2.4 హెక్టార్లలో తమలపాకు.. తోట్లవల్లూరు, అవనిగడ్డ పెనుమలూరు మండలాల్లో 2.4 హెక్టార్లలో మామిడి పంటలు దెబ్బతిన్నాయి.

>
మరిన్ని వార్తలు