కృష్ణమ్మ ఉగ్రరూపం

17 Aug, 2019 08:27 IST|Sakshi
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణమ్మ ఉధృతి

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఉధృతంగా కృష్ణమ్మ

పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో గంటగంటకూ పెరుగుతున్న ఉధృతి

బ్యారేజ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

నీట మునిగిన పున్నమీఘాట్, మాజీ సీఎం చంద్రబాబు ఇల్లు

చెవిటికల్లులో నాటు పడవ బోల్తా పడి ఓ చిన్నారి గల్లంతు

సాక్షి, విజయవాడ: కృష్ణవేణి రౌద్రాన్ని ప్రదర్శిస్తోంది. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్రంగా విరుచుకుపడుతోంది. పులిచింతల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో బిరబిరా దిగువకు పరుగులు పెడుతోంది. జనావాసాలను కూడా తన రాజమార్గంలో కలిపేసుకుంటూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువున జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో పరివాహక గ్రామాలు.. ప్రకాశం బ్యారేజ్‌ దిగువున లంక గ్రామాలు ఇప్పటికే ముంపు బారిన పడ్డాయి. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెవిటికల్లులో నాటు పడవ బోల్తా పడి ఓ బాలిక వరద నీటిలో గల్లంతయ్యింది.


పెనమలూరు నియోజకవర్గం పెదపులిపాక వద్ద నీట మునిగిన ఇళ్లు, అరటి తోటలు

కృష్ణానది వరద రోజురోజుకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శుక్రవారం ఉదయం 6.30లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వెళ్లిన ఉధృతి సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. సాయంత్రం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో 7.57లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 7.71లక్షల క్యూసెక్కులకు చేరింది. అయితే శనివారానికి పదిలక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

నాటు పడవ బోల్తా.. బాలిక గల్లంతు..
 
పెదపులి పాక వద్ద నీటమునిగిన ఇళ్ల మధ్యలో పడవపై బయటకు వస్తున్న గ్రామస్తులు 

నందిగామ నియోజకవర్గం కంచికచర్లలోని చెవిటికల్లులో నాటు పడవ బోల్తా పడి గౌతమి ప్రియ అనే బాలిక గల్లంతయ్యింది. వరదనీరు పెరిగిపోవడంతో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. అయితే సామర్థ్యానికి మించి ఎక్కడంతో పడవ నీట మునిగింది. పడవ నడిపే వ్యక్తి బోటులోని నీటిని తోడి పోస్తూ ఉండగా ఆ ఘటన చోటు చేసుకుంది. పడవలో ప్రయాణం చేసే ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. గౌతమి ప్రియ గల్లంతైంది. 

ప్రకాశం బ్యారేజ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు..
వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్‌ పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ దిగువన దాదాపు 8 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. ఇది పది లక్షలకు చేరే అవకాశం ఉన్నందున భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. 

పవిత్ర హారతులకు బ్రేక్‌...
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి నిర్వహించే పవిత్ర హారతులను దుర్గగుడి అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 

24 గ్రామాలకు ముంపు..
కృష్ణానదికి వచ్చిన వరదలు ప్రభావం జిల్లాలో 18 మండలాల్లోని 24 గ్రామాలు, విజయవాడ నగరంపై పడింది. 12 గ్రామాలు జలప్రవాహంలో చిక్కుకున్నాయి.   8,100 మంది బాధితులున్నారు. 2,839 హెక్టార్ల వ్యవసాయ పంటలు, 1,398.12 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 20 హెక్టార్లలో పట్టు పరిశ్రమకు సంబంధించి పంటలు(సెరీకల్చర్‌) దెబ్బతిన్నాయి. 

దెబ్బతిన్న 160 ఇళ్లు.. 36 లక్షల ఆస్తినష్టం..
వరదల వల్ల ఇప్పటి వరకు జిల్లాలో రూ.36 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 60 పక్కా ఇళ్లు, 40 కచ్చా ఇళ్లు, 20 పూరిళ్లు పూర్తిగానూ.. మరో 40 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరిస్తున్నారు. మరో 315 ఇళ్లు 24 గంటలుగా వరద నీటిలో నానుతున్నాయి.

అంతిమ సంస్కారానికి అవస్థలు..
కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంజలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇళ్లలోంచి బయటకు రావాలంటే నాటుపడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే గ్రామంలో రత్తయ్య అనే వృద్ధుడు చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు వరద నీటిలోనే తీసుకువెళ్లారు. లక్ష్మివాగుకు వరద నీరు చేరడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబసభ్యులు ఇబ్బంది పడ్డారు. 

  • భట్టిప్రోలు, పెసరలంక గ్రామంలో కృష్ణానది కరకట్టకు గండి పడటంతో గ్రామంలోకి వరద నీరు వచ్చింది. 
  • దివిసీమలో వరద ఉధృతి పెరగడంతో అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని పాతెండ్లకు గ్రామానికి బాహ్య ప్రపంచంలోకి సంబంధాలు తెగిపోయాయి. పులిగడ్డ అక్విడెట్‌కు కేవలం ఒక్క అడుగు తక్కువగా వరద నీరు ప్రవహిస్తోంది. పులిగడ్డపల్లెపాలెం, దక్షిణ చిరువోలు లంక, బొబ్బర్లంక, కె.కొత్తపాలెం గ్రామాల్లో వరద నీరు చేరింది. 
  • చల్లపల్లి మండలం నడకుదురు వెలవోలు, ఘంట సాల మండలం శ్రీకాకు ళం, పావనాశనం గ్రామాల్లో కరకట్ట కింద ప్రాంతా లు నీటమునిగాయి. భవానీపురంలోని వరదనీటిలో చిక్కుక్కున్న శ్రీ కృష్ణ చైతన్య సేవ ట్రస్టు చిల్డ్రన్స్‌ హోమ్‌ విద్యార్థులను దగ్గరుండి పడవపై తరలించారు. 

సహాయక చర్యల్లో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు
వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణానదిలో మేకలతో సహ గొర్రెల కాపర్లు చిక్కుకున్నారని తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు బోటులో వెళ్లి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నంలో ముంపునకు గురైన వారిని ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వరదముంపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దివిసీమలోని గ్రామాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ కలయ తిరుగుతూ ముంపు బారిన పడకుండా కాపాడుతున్నారు. 

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులు 

మంత్రుల ఆరా..
మంత్రులు బొత్సా సత్యనారాయణ, అనిల్‌కుమార్, వెలంపల్లి శ్రీనివాస్‌ వరద గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి పునరావాసకేంద్రాల సంఖ్యను పెంచుతూ బాధితులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కేపీ సారథి, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్‌ వరద ముంపు ప్రాంతాలను విస్తృతంగా పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. 

శాంతించు కృష్ణమ్మా!
ఇంద్రకీలాద్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ దుర్గగుడి ఈవో వీ. కోటేశ్వరమ్మ శుక్రవారం దుర్గాఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బ్యారేజీని పరిశీలించిన విజయవాడ సీపీ
విజయవాడ పశ్చిమ: వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌తో పాటుగా పలువురు డీసీపీలు, ఏసీపీలు సైతం బ్యారేజీపై పరిస్థితిని పరిశీలించారు. అలాగే ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. 

మరిన్ని వార్తలు