కృష్ణమ్మ పరవళ్లు !

13 Aug, 2018 15:05 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో కృష్ణానది జలకళ

భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో బ్యారేజి వద్ద అధికారులు 40 గేట్లు ఎత్తి  దిగువకు నీరు విడుదల చేశారు. జలకళ సంతరించుకున్న కృష్ణానదిని కనులారా వీక్షించేందుకు ప్రజలు బ్యారేజి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నీటి ఉద్ధృతి కన్పించేలా సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపుతున్నారు.

సాక్షి, విజయవాడ : భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో కృష్ణానది  జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో బ్యారేజి నిండుకుండలా మారింది. 40 గేట్లు ఎత్తిన అధికారులు 29 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు బ్యారేజ్‌ వద్ద 12 అడుగుల నీరు దాటడంతో నాలుగు గేట్లను ఒక అడుగు ఎత్తు పైకి తీసి  సముద్రంలోకి వర్షపు నీరు వదిలారు. ఆ తరువాత పెరుగుతున్న వరద ఉధృతికి అనుగుణంగా గేట్లను పెంచుకుంటూ వెళ్లారు. కాల్వలకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేశారు.  మున్నేరు, కట్టలేరు, పాలేరు నుంచి వరద నీరు కృష్ణానదిలోకి వచ్చి చేరుతోంది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీరు మున్నేరు వద్ద ఉందని అధికారులు లెక్కిస్తున్నారు.

కడలిలోకి ఒక టీఎంసీ నీరు....
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఒక టీఎంసీ నీటిని సముద్రంలోకి వదిలి వేశామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరద ఉధృతిని బట్టి రెండు రోజులు పాటు సముద్రంలోకి నీరు వదలాల్సి ఉంటుంది.  వరద తీవ్రత మరింత పెరిగితే మరికొద్ది రోజులు కొనసాగిస్తామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 12 అడుగులు (3.07 టీఎంసీ) కంటే ఎక్కువ నీరు ఉండే అవకాశంలేనందున పై నుంచి వచ్చే నీరు తొలుత కాల్వలోకి, తరువాత సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మున్నేరు వాగు ఉధృతంగా పెరగడంతో పక్కనే ఉన్న పొలాలు నీట మునుగుతున్నాయి. నీటి ప్రవాహం మరింత పెరిగితే వందల ఎకరాలు నీట మునిగిపోయే అవకాశాలున్నాయి.  రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా వరదనీటిని వడిసి పట్టేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కాల్వలకు 11,500 క్యూసెక్కుల నీరు విడుదల
ప్రకాశం బ్యారేజ్‌ ఎగువ నుంచి వరద నీరు  ఉధృతంగా వస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు పూర్తిస్థాయి సాగునీరు విడుదల చేస్తున్నారు. కాల్వల ద్వారా 11,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు రైతులకు ఉపయోగపడేది లేదు. ఒకవైపు శనివారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో కాల్వలపై రైతులు ఏ మాత్రం ఆధారపడటం లేదు.

ప్రజలను అప్రమత్తం చేశాం...
మున్నేరు, కట్టలేరు నుంచి వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 12 అడుగుల నీటి దాటిన బ్యారేజ్‌ దిగువకు వదిలివేస్తున్నారు. సముద్రంలోకి నీరు వదిలేడప్పుడు ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. 68 కిమీ దూరంలో ఉన్న హంసలదీవి వద్ద సముద్రంలో వరద నీరు కలవాలంటే సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంటుంది.
-సతీష్‌కుమార్, చీఫ్‌ ఇంజినీరు, జలవనరులశాఖ

మరిన్ని వార్తలు