సోమశిలకు కృష్ణాజలాలు

10 Aug, 2013 03:51 IST|Sakshi

సోమశిల, న్యూస్‌లైన్: సోమశిల జలాశయానికి కృష్ణా నదీ జలాలు విడుదల చేశారు. రెండు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిసింది. మూడువేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కేసీకెనాల్‌లోకి నీరు విడుదలవుతోంది. కేసీకెనాల్ నుంచి నంద్యాల సమీపంలోని రాజోలుబండ కుందూ నది ద్వారా రెండువేల క్యూసెక్కుల నీరు పెన్నా నదిలో కలుస్తోంది.
 
 పెన్నా నది ప్రధాన హెడ్‌రెగ్యులేటర్ అయిన ఆదినిమ్మాయపల్లి వద్ద శుక్రవారం సాయంత్రానికి 1,100 క్యూసెక్కుల నీరు విడుదలయింది. వైఎస్సార్ జిల్లా చెన్నూరుగేజి వద్ద 1,900 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయానికి వెయ్యి క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో 7.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి విడుదలను అంచెలంచెలుగా పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మూడు వేల నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జలాశయం డెడ్‌స్టోరేజ్‌లో ఉన్న తరుణంలో కృష్ణాజలాలు కొంతమేర ఊరటనిచ్చాయి. రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు