మట్టపల్లి వంతెన

12 Jan, 2014 04:12 IST|Sakshi

మట్టపల్లి (మఠంపల్లి), న్యూస్‌లైన్ : మట్టపల్లి వద్ద కృష్ణానదిపై రూ.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనకు శ్రీలక్ష్మీనృసింహుడి వారధిగా ప్రభుత్వ అనుమతితో నామకరణం చేయనున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మట్టపల్లి వద్ద వంతెన నిర్మాణ పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడినుంచి భారీ ర్యాలీగా లక్ష్మీనృసింహస్వామి దేవాలయ సమీపంలోని బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వారధి వల్ల ఫిబ్రవరి చివరి నాటికి ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మెరుగైన సౌకర్యాలు సమకూరుతాయన్నారు. రాష్ట్రంలో మూడవ విడత రచ్చబండలో రూ.10,450 కోట్లతో 13లక్షల 65 ఇళ్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్, విద్య, వైద్యం, రహదారి, సాగు తాగునీరు పథకాలను కోట్లాది రూపాయలతో చేపట్టినట్లు వివరించారు. హుజూర్‌నగర్‌లో 112 ఎకరాలలో రూ.150 కోట్లతో నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీ పరిశీలనకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు.

 ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రస్తుతం ఎన్‌టీపీసీలో సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.  అనంతరం రైతుబంధు పథకం కింద రూ.కోటి 70 లక్షల రుణాలను రైతులకు చెక్కు రూపంలో అందజేశారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌లు, వివిధ వర్గాల వారు మంత్రి, ఎంపీలను శాలువాలు, పూలమాలలతో  సత్కరించారు.
 
 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, హౌసింగ్ సీఈ ఈశ్వరయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ లింగయ్య, ఆర్‌డీఓ శ్రీనివాసరెడ్డి, ఐడీసీ డెరైక్టర్ శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగన్నగౌడ్, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బ్లాక్, మండల అధ్యక్షులు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్, మంజీనాయక్, నాయకులు నిజాముద్దీన్, మధిరప్రతాపరెడ్డి, వెంకటనర్సయ్య, వెంకటరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, రామారావు, గడ్డిరెడ్డి,అప్పయ్య, ఎలియాస్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు