కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రెండు నెలలు వాయిదా!

1 Oct, 2013 01:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వాయిదా పడింది. బ్రజేష్‌కుమార్ అధ్యక్షతలోని ప్రస్తుత ట్రిబ్యునల్ గడువు సోమవారంతోనే ముగిసింది. అయితే, తీర్పు ప్రకటించేందుకు వ్యవధి కావాలని ట్రిబ్యునల్ కోరడంతో గడువును మరో రెండునెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా గడువు ప్రకారం నవంబర్ నెలాఖరుకు ట్రిబ్యునల్ తన తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారంకోసం సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌వుుందు ఇప్పటికే ఆయా రాష్ట్రాల వాదనలు పూర్తయ్యూరుు. 2010 డిసెంబర్ 2న మధ్యంతర తీర్పును కూడా ట్రిబ్యునల్ ప్రకటించింది. అరుుతే, ఈ తీర్పులో పలు అంశాలు మన రాష్ట్రానికి నష్టం కలిగించేవిగా ఉన్నాయి.
 
 కర్నాటకలో ఆలమట్టి డ్యాం ఎత్తునకు అనుమతి ఇవ్వడం, మిగులు జలాలను గుర్తించి, వాటిని ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయడం వంటి అంశాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తీర్పులో సవరణలను చేయాలని రాష్ర్టప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. తీర్పులోని పలు అంశాలపై ఎగువ రాష్ట్రాలు కూడా సవరణలు కోరాయి. దాంతో సవరణలపై ఆయా రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ గత మూడేళ్ల నుంచి విన్నది. గత నెలలో కూడా జరిగిన ట్రిబ్యునల్ సమావేశంతో వాదనలు పూర్తయ్యాయి....తీర్పును ప్రకటిస్తామని ఈ సమావేశాల సందర్భంగా ట్రిబ్యునల్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నాటికి తీర్పు వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో తీర్పును ప్రకటనకు మరో రెండునెలల గడువును ట్రిబ్యునల్ కోరింది. దాంతో నవంబర్ 30వరకు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 

మరిన్ని వార్తలు