రాష్ర్ట రైతులకు మరణ శాసనమే

2 Dec, 2013 02:28 IST|Sakshi
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరణ శాసనం రాసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్  పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వ వాదనలే జడ్జిమెంట్ రూపంలో వచ్చాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టాన్ని చేసిన అత్యంత భయంకర తీర్పుగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. 
 
 నీటి పారుదల రంగంపై కనీస అవగాహనలేని న్యాయవాదులు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడం వల్లే రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితులు దాపురించాయన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపరివాహక ప్రాంత రైతులు, విశ్రాంత అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ సూచనల ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పూటకోమాట  మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.  సమావేశంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజ నారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు