సాగర్‌కు కృష్ణమ్మ

10 Aug, 2019 03:46 IST|Sakshi

శ్రీశైలం వద్ద గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేసిన మంత్రులు

వరద మరో 10 రోజులు కొనసాగే అవకాశం

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారడం.. భీమా నదిపై ఉజ్జయిని డ్యామ్‌ నిండిపోవడం.. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రవాహ జలాలు పెరగటంతో శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లను తెరిచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. పైనుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 5.30 గంటల సమయంలో నాలుగు గేట్లను ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు.

వరద ప్రవాహం ఇంకా పెరుగుతుందన్న సమాచారంతో రాత్రి మరో రెండు గేట్లను తెరిచారు. మొత్తం ఆరు గేట్ల ద్వారా 1,59,084 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పాదన ద్వారా మరో 73,139 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు పంపుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు మరో 31,560 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. ఐదేళ్లలో ఆగస్టు 10వ తేదీ ముందు శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. కాగా.. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి జూరాల నుంచి 4,89,114 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తుండగా.. దిగువ ప్రాంతాలకు 2,36,137 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

జలాలను పంచుకుందాం

శ్రీశైలం గేట్లు ఎత్తే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జయ్‌పాల్‌ యాదవ్‌ హాజరయ్యారు. తొలుత పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జల వనరుల శాఖమంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు అన్నదమ్ముల్లా పంచుకుని.. ఇరు రాష్ట్రాలనూ సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. మరో 10, 15 రోజుల్లో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర , హంద్రీ నుంచి వరద ప్రవాహం రాకపోయినా జూరాల నీటితోనే డ్యామ్‌ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతోందన్నారు. 

>
మరిన్ని వార్తలు