రాజకీయ లబ్ధికే బీసీల్లో చేర్చారు: కృష్ణయ్య

3 Dec, 2017 01:21 IST|Sakshi

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బీసీల్లో చేర్చడం హేయమైన చర్య అని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. దీనిపై బీసీలంతా టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తారనే వార్తలు వెలువడ్డ నాటి నుంచి బీసీలంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా ప్రయత్నిస్తే తాను హైకోర్టులో పిల్‌ వేసి అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

బీసీల కోసం త్వరలో పార్టీ
బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించే దిశగా యోచిస్తున్నట్లు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామానికి వెళ్లినా బీసీల కోసం పార్టీ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారన్నారు. వారందరి మేలు కోసమే పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో 72 బీసీ కులాల సభలో కృష్ణయ్య మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు