కృష్ణావర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.7.17 కోట్లు

11 Oct, 2014 01:22 IST|Sakshi
  • ఆరు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి
  •  తొలుత అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం
  •  కృష్ణా వర్సిటీ వీసీ పున్నం వెంకయ్య వెల్లడి
  • మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వున్నం వెంకయ్య తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇం దుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాలను గతంలో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పారు. ఈ భూమిలో రూ.72 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. భవనాల నిర్మాణ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీపీడబ్ల్యూడీ ఎస్‌ఈ ఈఎం గామిట్, ఈఈ నాగేశ్వరరావులకు మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును ఈ సందర్భంగా వీసీ అందజేశారు.
     
    1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనం

    అకడమిక్ భవనాన్ని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అంచనాలు రూపొందించామని వీసీ తెలిపారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు. జీ+2 పద్ధతిలో ఈ భవనాలు నిర్మించాలని నమూనాలు తయారు చేశారని, అయితే మొదటి విడతలో మాత్రం జీ+1 పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

    నిధుల వెసులుబాటును బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండంతో రోడ్డుకు మూడున్నర అడుగుల ఎత్తులో మెరక చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ భూముల్లో పటిష్టమైన నిర్మాణాల కోసం 70 అడుగుల లోతుకు వెళ్లి భూ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భూమిపై శ్లాబు వేసి, దానిపై భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు.

    భవన నిర్మాణ పనులను హైదరాబాదుకు చెందిన జేఎన్‌టీయూ సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. రూ.72 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ తరహాలో ఇక్కడ భవనాల నిర్మాణం జరుగుతుందని, 100 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

    భవన నిర్మాణం కోసం మొదటి విడతగా సీపీడబ్ల్యూడీపీకి 10శాతం నిధులను సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి విడతగా రూ. 7.17 కోట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేసినట్లు వీసీ వివరించారు. నగదు అందజేసిన అనంతరం టెండర్ల ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని, డిసెంబరు లేదా జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీపీడబ్ల్యూడీ ఎస్‌ఈ ఈఎం గామిట్ మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను డీడీ రూపంలో అందజేసేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, సిబ్బంది తమకు సహకరించారని తెలిపారు.
     
    పబ్లిక్ లెక్చర్ సిరీస్

    కృష్ణా యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ లెక్చర్ సిరీస్‌ను నవంబరులో నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. నవంబరులో నిర్వహించే 3వ పబ్లిక్ లెక్చర్ కార్యక్రమానికి కామన్‌వెల్త్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఫర్ ఆసియా డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. నాలుగో లెక్చర్‌కు నాక్ మాజీ చైర్మన్ రామ్‌తక్వాలే ముఖ్య అతిథిగా హాజరై దేశంలోని ఉన్నత విద్య విధానంపై ఉపన్యసిస్తారని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ నవంబరు మొదటి వారంలో స్మారక ఉపన్యాసం జరుగుతుందని రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరున ఈ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా తరంగ్-2014 యువజనోత్సవాలను నవంబరులోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
     
    ఆన్‌లైన్ పరీక్షా విధానం అమలు

    కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. పరీక్షా కేంద్రానికి 40 నిమిషాల ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌లో పంపుతామని, ఈ ప్రశ్నాపత్రాన్ని తెలుసుకునేందుకు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  
     
    ఎం.టెక్ కోర్సు ప్రారంభం

    కృష్ణా వర్సిటీలో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ చెప్పారు. పీజీ ఇంజినీరింగ్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు