రోజుకు 30 వేల కరోనా పరీక్షలు

22 Jun, 2020 02:33 IST|Sakshi

ఆ మేరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం

ప్రస్తుతం రోజుకు 22 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం

పరీక్షలకు రోజుకు రూ.2 కోట్లు ఖర్చు పెడుతున్నాం

ఏకకాలంలో 40 వేల మందికి వైద్యం అందించేలా ఏర్పాట్లు

‘సాక్షి’తో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 22 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. దీన్ని 30 వేలకు పెంచుతాం. పరీక్షలకు రోజుకు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కార్‌ ముందుకెళుతోంది. 40 వేల మందికి ఏకకాలంలో వైద్యం అందించేలా పడకలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో 20 వేల వరకు ఆక్సిజన్‌ పడకలే’ అంటున్నారు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

  • కరోనా తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు ఇంట్లోనే వైద్యం చేసేలా వైద్యులు చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వాళ్లు 80 శాతం మంది ఉంటారు. తీవ్రత ఎక్కువ ఉంటేనే ఆస్పత్రికి పంపుతాం.
  • నలభై ఏళ్లు దాటి, దీర్ఘకాలిక జబ్బుల (మధుమేహం, కిడ్నీ, హైపర్‌ టెన్షన్‌)తో బాధపడే వాళ్లందరికీ  స్క్రీనింగ్‌ చేస్తాం. 60 ఏళ్లు దాటిన వారికి కూడా పరీక్షలు చేసి, కోవిడ్‌  కేర్‌ లేదా స్టేట్‌ నోడల్‌ ఆస్పత్రికి తరలిస్తాం. ఇప్పటికే బీపీ, షుగర్, క్యాన్సర్, గుండెజబ్బులున్న వారిని గుర్తించి వారిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నాం.
  • రాష్ట్రంలో ఉన్న 20 వేల మంది పైగా ఉన్న వైద్యులే కాకుండా, మరో 24 వేల మంది హౌస్‌ సర్జన్‌ చేస్తున్న వారు, పీజీ చదువుతున్నవారు, స్టాఫ్‌నర్సుల సేవలు వినియోగించుకుంటున్నాం. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. రోజూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కరోనాపై సమీక్ష నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. చాలా రాష్ట్రాలు ఏపీ అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తున్నాయి.
  • రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో ఇద్దరు వైద్యులుండేలా చర్యలు చేపట్టాం. అలాగే ప్రతి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్ట్‌లు ఉండేలా చేస్తున్నాం.
  • గతంలో లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో ఒకేసారి 9,700 పోస్టులకు నియామకాలు చేపడుతున్నాం.
  • ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సర్కార్‌ 16 కొత్త వైద్య కళాశాలలను సీఎం నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. కొత్త కాలేజీలు వస్తే వైద్యసీట్లతోపాటు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.
మరిన్ని వార్తలు