ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు 

16 Sep, 2019 05:05 IST|Sakshi
గోదావరిలో కొట్టుకుపోతున్నవారిని కాపాడి ఒడ్డుకు చేర్చిన అడవి బిడ్డలు

పలువురిని కాపాడిన కచ్చులూరు గ్రామస్తులు 

కళ్లెదుటే లాంచి మునక 

హుటాహుటిన ఐదు బోట్లలో వెళ్లి సహాయక చర్యలు 

మానవత్వాన్ని చాటుకున్న గిరిజనులు

(దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం): ప్రమాదం ఎవరికో జరిగింది కదా అని ఊరికే ఉండలేదు.. మనకెందుకులే అని వారి దారి వారు చూసుకోలేదు.. మానవత్వాన్ని చూపించారు కచ్చులూరులోని అడవి బిడ్డలు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం బారిన పడిన వారిని ఆలస్యం చేయకుండా హుటాహుటిన పలువురిని ఒడ్డుకు చేర్చి ఆపద్బాంధవులుగా నిలిచారు. పలువురి మృతదేహాలనూ వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో వీరందించిన సేవలు మానవత్వానికి నెలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సాధారణంగా ప్రతీ ఆదివారం కచ్చులూరు గ్రామస్తులు మధ్యాహ్న సమయంలో గోదావరి ఒడ్డున కూర్చోవడం వారికి అలవాటు. అదే సమయంలో కళ్లేదుటే పర్యాటక లాంచి మునిగిపోవడంతో ఒక్క ఉదుటున కదిలారు.

ఇంజన్‌ బోట్లు స్టార్‌చేసి ఒక్కసారిగా మునిగిపోతున్న లాంచి వద్దకు చేరుకున్నారు. లైఫ్‌ జాకెట్లు ధరించడంతో నీటిపై తేలుతున్న పలువురిని అడవి బిడ్డలు రక్షించి సురక్షితంగా మామిడిగొంది గ్రామం ఒడ్డుకు చేర్చారు. కాగా, ఈ దుర్ఘటనపై కచ్చులూరు గ్రామానికి చెందిన నేసిక లక్ష్మణరావు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం గోదావరి ఒడ్డున కూర్చుని ఉన్నాను. గ్రామా నికి ఎదురుగా ఉన్న కొండ దగ్గర లాంచి వెనక్కి వెళ్తోంది. ఏం జరుగుతుందో అని చూస్తుండగానే లాంచి పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోతోంది. దీంతో గ్రామస్తులందరం ఐదు పడవల్లో వేగంగా అక్కడకు చేరుకుని నీటిపై ఉన్న వారిని రక్షించాం’.. అని వివరించాడు. అలాగే, కచ్చులూరు గిరిజన మత్స్యకారులు మునిగిపోయిన బోటు నుంచి ఒక్కొక్కటిగా బయటపడే బ్యాగులను సేకరించి పోలీసులకు అందించారు.  

నాటు పడవలు వేసుకుని వెళ్లాం 
ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే నాటు పడవలు వేసుకుని అక్కడకు వెళ్లాం. వరదవల్ల తొందరగా అక్కడకు చేరుకోలేకపోయాం. లైఫ్‌జాకెట్లు వేసుకున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాం.  
– కె. వీరభద్రారెడ్డి, తూటుకుంట, పశ్చిమగోదావరి జిల్లా 

మా కళ్లెదుటే మునిగిపోయింది 
మధ్యాహ్నం ఫోన్‌ సిగ్నల్‌ కోసం గోదావరి ఒడ్డుకు వచ్చాను. ఈలోపు బోటు మునిగిపోవడం కంట పడింది. ఒడ్డున ఉన్న వారు వెంటనే పడవలతో కాపాడేందుకు వెళ్లి కొంతమందిని 
రక్షించారు. 
– చెదల దుర్గ, తూటుకుంట, పశ్చిమ గోదావరి జిల్లా

>
మరిన్ని వార్తలు