అరాచకం 2.0 

6 Apr, 2019 13:13 IST|Sakshi

పొందూరులో పెచ్చుమీరిన విప్‌ ఆగడాలు

అనుచరులతో కోట్లు కొల్లగొట్టిన వైనం

అర్హులకు అన్నింటా మొండిచేయి

సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూన రవికుమార్, అతని అనుచరుల దందా మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగింది. చేతిలో అధికారం ఉండడంతో అందిన కాడికి అందినంత దోచుకున్నారు. నచ్చిన వారి అభివృద్ధికి పెద్దపీట వేసి, నచ్చని వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చేసే ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకొని కోట్లకు పడగలెత్తారు.

వంశధార గర్భశోకం
మండలంలోని సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని మూడు ఇసుక ర్యాంపులు ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌కు కోట్ల రూపాయల కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల సమక్షంలో నాగావళి నది తీరాన రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను జేసీబీలతో తవ్వి, రవికుమార్‌ అనుచరులు జగన్నాథం, సత్యం, గణపతి తదితరుల సహాయంతో ఇసుక దందా నడిపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులు హెచ్చరించినా వారిని కూడా భయపెట్టిన సంఘటనలు ఉన్నాయి. నిబంధనలు మేరకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్‌కు రూ.3,500ల వరకు విక్రయించారు.

రియల్‌ దందా
ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అండదండలతో పొందూరులో రియల్‌ ఎస్టేట్‌ దందా యథేచ్ఛగా సాగింది. ఉడా అనుమతులు లేకుండా భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ చేయాలేని పరిస్థితి కల్పించారు.

జాగా కనిపిస్తే పాగా 
ఐదేళ్ల పాలనలో ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా రవికుమార్, అతని అనుచరులు కబ్జా చేసేశారు. రాపాక కూడలికి సమీపంలో విలువైన స్థలాలను ఆక్రమించారు. పాన్పుల గెడ్డను కప్పేసి గృహాలు, దుకాణాలను నిర్మించేశారు. మిగిలిన కొద్దిపాటి గెడ్డను కూడా మరలా కప్పేసేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే విద్యుత్‌ పవర్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్మేందుకు సన్నాహాలు చేశారు. అయితే విషయం బయటకు తెలియడంతో అమ్మకాలు జరగకుండా అధికారులు నిలుపుదల చేశారు. కానీ ఈ స్థలం ఇంకా టీడీపీ నాయకుల ఆధీనంలోనే ఉంది.

నీరు–చెట్టు కనికట్టు 
మండలంలోని 29 పంచాయతీల్లో నీరు–చెట్టు పనుల పేరుతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు జరిపి రూ.కోట్ల దోచుకున్నారు. చెరువులను అభివృద్ధి చేసే నెపంతో ప్రజల సొమ్మును అడ్డగోలుగా వెనకేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టకుండా, తీర్మానాలు చేయకుండానే పనులు జరిపారు. నిజానికి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా మిషన్లుతో జరిపి కూలీలకు ఉపాధి లేకుండా చేశారు. నీరు–చెట్టు వలన రవికుమార్‌ అనుచరులకు తప్ప రైతులకు ఎటువంటి మేలు జరగలేదని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.

కమీషన్లకే కొత్త పనులు
మండలంలోని రెల్లుగెడ్డ ప్రాజెక్టును ఆధునికీరించేందుకు ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా గెడ్డకు ఇరువైపులా గట్లను పటిష్టం చేయడం, సిమ్మెంట్‌ గోడలు నిర్మించడం, చెక్‌ డ్యాంలు నిర్మించడం వంటి పనులను చేయాలి. అయితే నిధులను దోచేయాలనే తాపత్రయంతో పనులను సగం కూడా జరిపించిన పాపాన పోలేదు. తాడివలస వద్ద చెక్‌డ్యాం, గేట్లు, సిమ్మెంట్‌ వాల్‌ను రూ.కోటి లతో నిర్మించగా నిర్మించిన నెల రోజులకే అది కూలిపోయింది. కూలిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడి ‘పింఛెన్‌’
గ్రామాల్లోని జన్మభూమి కమిటీల సభ్యులు పింఛన్లు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారి పింఛన్లను తొలగించారు. దీంతో అనేక మంది లబ్ధి దారులకు పింఛన్లు అందక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ బాధిత పింఛన్‌దారుల తరుపున జన్మభూమి కమిటీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి పోరాడి 470 మంది పింఛన్లను బకాయిలతో సహ ఇప్పించేందుకు కృషి చేశారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది అర్హులకు పింఛన్లు అందడం లేదు.

అధికారులు హెచ్చరించినా ఆగలేదు
సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని ఇసుక ర్యాంపులను అధికారులు పలుమార్లు మూయించారు. కానీ మూసిన రెండు రోజుల్లోనే విప్‌ రవికుమార్‌ మరలా తెరిపించేవారు. నదీ గర్భాలను కొల్లగొట్టి అధిక ధరలకు ఇసుకను విక్రయించారు. ఇప్పటికీ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది.              
– బొడ్డేపల్లి రమణ, బొడ్డేపల్లి

గెడ్డలను ఆక్రమించేశారు
రాపాక సెంటర్‌లో పాన్పుల గెడ్డను టీడీపీ నాయకులు ఆక్రమించి బిల్డింగులు కట్టేశారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, కుమ్మరి, ముస్లింలు ఎంతో మంది భూమిలేని పేదలున్నారు. వారికి భూమి ఇచ్చేందుకు అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తున్నాయి. టీడీపీ నాయకులు గెడ్డలను ఆక్రమించుకుంటుంటే మాత్రం నిబంధనలు కనిపించకపోవడం దారుణం.
– కొంచాడ రమణమూర్తి, రాపాక

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు