కుప్పకూలనున్న రిజిస్ట్రేషన్ల వ్యవస్థ

21 Jan, 2014 01:36 IST|Sakshi
కుప్పకూలనున్న రిజిస్ట్రేషన్ల వ్యవస్థ
 • ప్రజల ఆస్తులకు రక్షణ కరువు  
 •  ముందుగా స్లాట్ బుకింగ్   
 •   నగరంలో దరఖాస్తు నమూనా
 •  ఆందోళనలో రిజిస్ట్రేషన్స్ సిబ్బంది
 •  
  విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆన్‌లైన్ విధానం పేరుతో రిజిస్ట్రేషన్స్ శాఖను ప్రైవేటు వక్తులకు సర్కారు ధారాదత్తం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. త్వరలో  రిజిస్ట్రేషన్స్ కార్యకలాపాలన్నింటినీ  మీ-సేవకు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్‌లైన్ విధానాన్ని హడావుడిగా చేపట్టిన ప్రభుత్వం.. ప్రజల ఆస్తుల క్రయవిక్రయాలను మీ-సేవ కేంద్రాలకు అప్పగించడానికి తుది చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం అమల్లోకి వస్తే మరికొన్ని నెలల్లో రిజిస్ట్రేషన్స్ శాఖ కనుమరుగవుతుంది.

  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఆధీనంలో నడుస్తున్న  మీ-సేవకు రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యకలాపాలన్నింటినీ దొడ్డిదారిలో అప్పగించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు, సిబ్బంది, వారికి అనుబంధంగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ-సేవలను టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ద్వారా అందించేవారు. అప్పట్లో కొన్ని రకాల సేవలను మాత్రమే సర్వర్ ద్వారా ఈ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.

  రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి కిరణ్ ఈ-సేవలను, మీ-సేవలుగా మార్చి.. దాదాపు 200 రకాల సేవలను ఈ కేంద్రాలకు అప్పగించారు. సీఎం సోదరుడు నిర్వహిస్తున్న డేటామాట్రిక్ కార్పొరేషన్‌కు మీ-సేవ కాంట్రాక్టు అప్పగించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ శాఖ దశలవారీగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయి ప్రజల ఆస్తులకు భద్రత కరవవుతుందని ఆరోపిస్తున్నారు.  

  ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని చేసే వేలాది మంది సిబ్బందిని  వివిధ డిపార్టుమెంట్లకు సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒక సబ్ రిజిస్ట్రార్, అటెండర్ మాత్రమే ఉంటారు. ఆస్తుల లావాదేవీల్లో ప్రస్తుతం సబ్  రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది చేసే పనంతా మీ-సేవల్లోనే  చేసేస్తారు. దాంతో కార్యాలయాల్లో సిబ్బంది, వేతనాలు, అలవెన్స్‌లు, ఇతర ఖర్చులు కలిసి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
   
   మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ఇలా..
   రిజిస్ట్రేషన్ చేసే వారు ముందుగా మీ-సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
   
   స్లాట్‌లో దరఖాస్తుదారుడికి  సీరియల్ నంబర్, రిజిస్ట్రేషన్ డేట్ ఇస్తారు. నిర్ణీత తేదీలో మీ-సేవ కేంద్రానికి వెళ్లి కక్షిదారులు తమ ఆస్తులపై వివిధ  రకాల లావాదేవీలు జరుపుకోవచ్చు.
   
   ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మీ-సేవా కేంద్రంలో పొందుపొరిచిన నమూనా దరఖాస్తు కూడా ఇప్పటికే తయారైంది. అర్జీదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆ దరఖాస్తును పూర్తి చేస్తే ఆన్‌లైన్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళుతుంది.
   
   సబ్ రిజిస్రార్ వెరిఫికేషన్ చేసి క్లిక్ చేస్తే మీ-సేవ కేంద్రంలోనే డాక్యమెంటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముఖం చూడకుండానే మీ-సేవ  కేంద్రంలోనే తమ ఆస్తుల లావాదేవీలు జరుపుకోవచ్చు.
   
  స్తంభించిన వందల కోట్ల లావాదేవీలు..
   ఈ విషయమై గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగక, ఈసీలు, దస్తావేజు నకళ్లు తదితర సేవలు నిలిచిపోయి ప్రజలు ఆగచాట్లు పడుతున్నారు.

మరిన్ని వార్తలు