దమ్మున్న నాయకుడు జగన్‌

2 Oct, 2019 13:09 IST|Sakshi

కరప సభలో మంత్రులు సుభాష్‌ చంద్రబోస్‌, కన్నబాబు

సాక్షి, కాకినాడ: కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కరప గ్రామానికి వెళ్లిన విషయం తెలసిందే.. ఈ క్రమంలో కరప గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ఉపముఖ్యమంత్రి సుభాష్‌ చంద్రబోస్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన మాట జవదాటని నేత దివంగత మహానేత వైఎస్సార్‌ అయితే.. ఇచ్చిన మాట నెరవేర్చి  వైఎస్‌ జగన్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచారని ప్రశంసించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి అత్యధికంగా పండిస్తూ రాష్ట్రానికే కాక దేశానికి అన్నం పెడుతున్న ఈ రెండు జిల్లాలను ఆ రోజు వైఎస్సార్‌ ఆదరించారని గుర్తు చేశారు. ఈ రోజు సాగు చేస్తున్న రైతుల పట్ల వైఎస్‌ జగన్‌ కరుణ చూపిస్తున్నారని ఉపముఖ్యమంత్రి సుభాష్‌ కొనియాడారు.

రైతులకు  సీఎం జగన్‌ భరోసా కల్పిస్తూ, భూ యజమానులకు, కౌలు రైతులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఉదారంగా రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా రైతులు ఉత్సాహంగా సాగు చేసేవారని, ప్రస్తుతం వారు నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. అందరికీ సాయం చేసేందుకు ముందుకువచ్చిన వైఎస్‌ జగన్‌ను అభినందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోనే 2.60 లక్షల మంది వాలంటీర్లుగా, 1.30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడు: కురసాల
ప్రతి పనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని ఆయన వ్యా​ఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శప్రాయుడిగా సీఎం జగన్‌ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచే వైఎస్‌ జగన్‌ పూరించారన్నారు. దేశం మొత్తం చూసేవిధంగా ఎన్నికల ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు సాధించి, నాయకుడు అంటే ఈయనేనని వైఎస్‌ జగన్‌ దేశానికి చూపించారని పేర్కొన్నారు. ఒక వ్యవస్థను రూపొందించి దాన్ని అమలు చేయడానికి దమ్ముండాలని, అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం  జగన్‌ అని మంత్రి కన్నబాబు కొనియాడారు.

చంద్రబాబు వస్తే జాబు వస్తుందని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కానీ చంద్రబాబు హయాంలో ఎవరికీ ఒక్క జాబు కూడా రాలేదని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత యువత అంతా జగనన్న వచ్చాడు. జాబు ఇచ్చాడని నినదిస్తోందని తెలిపారు. ప్రజల ముందుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ తీసుకువచ్చారని, దశలవారీగా మద్య నిషేధం మంగళవారమే ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతటి సుపరిపాలనలో భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నానని మంత్రి కన్నబాబు అన్నారు. 

దేశమంతా ఆంధ్ర రాష్ట్రవైపు చూస్తుంది.  
గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయమని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు సీఎం వైఎస్‌ జగన్‌కు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం మాటను నిజం చేస్తూ వైఎస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారని అన్నారు. ఉద్యోగం వచ్చిన కుటుంబాలు నా బిడ్డకు జగనన్న ఉద్యోగం ఇచ్చాడని ఆనందపడుతూ సీఎంను ఆశీర్వదిస్తున్నారన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని మాత్రమే కాకుండా నేను ఉంటాను.. మీకు అన్నీ చేస్తానని సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారన్నారని కొనియాడారు. సీఎం జగన్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా