మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు

22 Jun, 2019 11:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రైతు భరోసా పథకం అమలు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. రైతులకు పెట్టుబడి ఇచ్చి అండగా నిలవాలని మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిజం చేస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. 'ధరల స్థిరీకరణ నిధి రూ.3000 కోట్లతో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. సహకార సొసైటీల ఆధునీకరణ కోసం రూ.120  కోట్లు విడుదల చేస్తున్నాం. నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. తక్షణమే అరికట్టి వ్యాపారులపై తీవ్ర చర్యలు తీసుకుంటాం. మిర్చి, పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని అరికడతాం. ఒక కంపెనీ కేజీ విత్తనాలు లక్షన్నరకు అమ్ముతోంది. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు కూడా భీమా, రుణాలు, ఇతర రాయితీలు కల్పిస్తాం. ఇందుకు ప్రత్యేక కార్డులను మంజూరు చేస్తాం. పంటల మీద హక్కులిచ్చేలా చర్యలు తీసుకుంటాం' అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు