త్వరలోనే కౌలు రైతులకు కార్డుల పంపిణీ: కన్నబాబు

27 Aug, 2019 20:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల 90 మండలాలు, 484 గ్రామాలు ప్రభావితం అయ్యాయన్నారు. సుమారు 22,022 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని.. ఫలితంగా రూ.95.23 కోట్ల నష్టం వాటిల్లిందని కన్నబాబు పేర్కొన్నారు. వాణిజ్య పంటలు ఇన్సూరెన్స్‌ పరిధిలోకి రావడం లేదనే అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓ కమిటీ వేసి వచ్చే సీజన్‌లో వారికి న్యాయం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. మినుము, పెసలపై మొదటిసారిగా 100శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చే పరిహారం ప్రత్యేక అకౌంట్‌లో వేసి.. రైతు చేతికే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు కన్నబాబు.

గ్రామ సచివాలయాలు ప్రారంభం కాగానే కౌలు రైతులకు ఇచ్చే కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకు గాను వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. పరిశోధన కేంద్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించి నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసేందుకు ఎమ్‌ఓయూ కుదుర్చుకుంటామని తెలిపారు. 24 గంటలు రైతులకు సేవలు అందించేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. రైతుకు సమగ్ర సేవలు అందించేలా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూసార పరీక్షల నుంచి ప్రతి అంశం మీద అధికారులు ముందుండాలన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కల్తీ ఎక్కడ కనిపించినా కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారన్నారు కన్నబాబు.

మరిన్ని వార్తలు