రైతు భరోసాలో ఒక్కపేరూ తొలగించలేదు

2 May, 2020 04:14 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు 

సాక్షి, అమరావతి: పీఎం కిసాన్, వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో 4 లక్షల మంది పేర్లను తొలగించినట్లు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించామని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, అనర్హులున్నా స్థానిక వ్యవసాయ సహాయకునికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖల సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.

కర్నూలు జిల్లాలో ఉల్లి పంట ఇప్పుడు ఎక్కువగా వస్తోందని, అయితే ఆ జిల్లా రెడ్‌ జోన్‌లో ఉండడంతో కొనడానికి వ్యాపారులు రావడం లేదని అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. దీంతో ప్రభుత్వమే మొత్తం సరుకును కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రాంతంలో సాగు చేసే కర్రపెండలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నాణ్యత లేదన్న సాకుతో కొందరు వ్యాపారులు టమాటా ధరను తగ్గిస్తున్నందున మొత్తం పంటను కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలిస్తామని చెప్పారు. ఒంగోలు రెడ్‌ జోన్‌లో ఉన్నందున సీఎం సూచన మేరకు.. పొగాకును సిటీలో నుంచి కాకుండా బయటి నుంచి సిటీ శివార్లలోని రెండు వేలం కేంద్రాలకు తీసుకెళ్లేలా అనుమతిస్తున్నట్టు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు