ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమీక్ష 

31 Mar, 2020 15:50 IST|Sakshi

సాక్షి, కాకినాడ : నిత్యావసర వస్తువుల ఉత్పత్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రానున్న మూడు నెలలకు సరిపడ వంటనూనెల ఉత్పత్తులకు సంబంధించి ఈ సందర్భంగా వారు చర్చించారు. రాష్ట్రంలో వంటనూనెల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆయిల్‌ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సంబంధించి పూర్తి సంరక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని కంపెనీలను కోరినట్టు చెప్పారు. విధులకు హాజరయ్యే కార్మికులకు పోలీసుల నుంచి ఆటంకాలు రాకుండా పాసులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరల పెరుగుదలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని తెలిపారు.

రాష్ట్రంలోని ఎడిబుల్‌ ఆయిల్‌ కంపెనీ వ్యవహారాలన్నీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ శ్రీకాంత్‌రెడ్డికి అప్పగించామని మంత్రి తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో ప్రజలకు రేషన్‌ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టకున్నామని అన్నారు. రేషన్‌ అందదేదోమోనన్న అభద్రతకు ప్రజలు గురి కావద్దని కోరారు. ప్రతి రేషన్‌కార్డు దారునికి సరుకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రేపు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరికీ పెన్షన్‌లు అందజేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను రైతు నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని ఎగుమతి దారులను కోరామని అన్నారు. కరోనా వల్ల తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించలేదని గుర్తుచేశారు. కరోనాపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. ప్రతి జిల్లాలో 5 వేల క్వారంటైన్‌ బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ప్రాణాలకు తెగించి కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని ఆయన హితవు పలికారు. 

చదవండి : ‘ఎల్లో వైరస్ కోరలు పీకే మందు ఉంది’

ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

మరిన్ని వార్తలు