బెంబేలెత్తిస్తున్న కర్నూలు-బళ్లారి రహదారి

23 Nov, 2013 04:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు/కోడుమూరు, న్యూస్‌లైన్: కర్నూలుకు చెందిన రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని హంపికి వెళ్లాలని సిద్ధమయ్యారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బయలుదేరే ముందు వాహన డ్రైవర్ చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యపర్చింది. బాడుగనైనా వదులుకుంటాను కానీ.. కోడుమూరు మీదుగా రానంటే రానని మొండికేశాడు. ఆ రహదారిలో వెళితే వాహనం ఎందుకూ పనికిరాకుండా పోతుందని.. పైగా ఆ కుదుపులకు ఒళ్లంతా పులిసిపోతుందని తన గోడు వెళ్లబోసుకున్నాడు.
 
  మీకూ క్షేమం కాదని డ్రైవర్ వారించడంతో చివరకు వారంతా డోన్ మీదుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. కర్నూలు-బళ్లారి రహదారిలో ప్రయాణమంటే ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ మాత్రమే. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఈ దారిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు. తమ తప్పు లేకపోయినా జరిగిపోయే ప్రమాదానికి ఎక్కడ బాధ్యులమవుతామోనని వారు నిత్య నరకం చూస్తున్నారు. గురువారం ‘సాక్షి’ బృందం ఈ రహదారిలో ప్రయాణించింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆదోని బస్సులో ఎక్కగా రెండు కిలోమీటర్లు దాటగానే అవస్థలు మొదలయ్యాయి. అడుగడుగునా మోకాల్లోతు గుంతలు.. కుదుపులతో బస్సుల్లోని ప్రయాణికులంతా తమ సీట్లలో నుంచి ఎగిరిపడుతున్నారు. పాలు పట్టినా.. జోల పాడినా చంటిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో సరోజ అనే మహిళ తల్లడిల్లింది.
 
  దుమ్ము లేస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నడుమ రెండు గంటలు ప్రయాణించగా కోడుమూరుకు చేరుకున్నాం. అక్కడి నుంచి మరో రెండు గంటల ప్రయాణంతో ఎట్టకేలకు ఆదోనికి వెళ్లగలిగాం. అక్కడి నుంచి ఆలూరు నియోజకవర్గంలోని వందవాగిలి, ఎల్లార్తికి వెళ్లేందుకు మరో బస్సులో ప్రయాణించాం. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం అత్యంత కష్టంగా సాగింది. నాగన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా టైర్ పగిలి గాయాలపాలవడం.. సిద్దప్ప అనే వ్యక్తి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పంక్చరైంది. దీంతో ఆ వాహనాన్ని ఓ చెట్టుకింద పెట్టి ఆటోలో ఆదోనికి వెళ్లిన ఘటనలు కనిపించాయి. చివరకు వందవాగిలికి చేరుకునే సరికి.. హమ్మయ్యా వచ్చేశామనిపించింది.
 
 పర్సెంటేజీలకు జడిసి చేతులెత్తేసిన
 కాంట్రాక్టర్
 రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని కర్నూలు-బళ్లారి మధ్య 30 మీటర్ల(డబుల్ లైన్) రోడ్డు వేసేందుకు ఐదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. రూ.120 కోట్లతో అంచనాలు రూపొందించగా.. కర్నూలు నుంచి దేవనకొండ వరకు 55 కి.మీ.ల రోడ్డు వేసేందుకు ఏపీఆర్‌డీసీ సంస్థ టెండర్‌లను ఆహ్వానించింది. 30 శాతం లెస్‌తో రూ.75 కోట్లకు పనులు దక్కించుకున్న రాణి కన్‌స్ట్రక్షన్స్ రోడ్డు నిర్వహణ పనులు మొదలు పెట్టింది.
 
  కోడుమూరు, ప్యాలకుర్తి, లింగందిన్నె గ్రామాల వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టి తీసి కోటి రూపాయల వ్యయంతో గ్రావెల్ పనులు చేపట్టింది. అప్పటికి మొబిలైజేషన్ నిధుల కింద రూ.10 కోట్లను ప్రభుత్వం నుంచి ఆ సంస్థ తీసేసుకుంది. అయితే పర్సెంటేజీల కోసం రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికం కావడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అదేవిధంగా ఎల్లార్తి రోడ్డుకు రూ.8 కోట్లు మంజూరైనా టెండర్లు పిలువలేదు. మార్లమరికి రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు