కర్నూలు ఎండుతోంది..

7 Jul, 2019 08:58 IST|Sakshi

కర్నూలులో నీటి కష్టాలు తీవ్రం

ఆందోళన కల్గిస్తున్న నిల్వలు 

తుంగభద్రకు వరద రాకపోతే అంతే సంగతులు 

సాక్షి, కర్నూలు :  కర్నూలు నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు కాలనీల్లో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాలు అడుగంటిపోవడం, తుంగభద్ర నదికి ఇప్పటికీ వరద రాకపోవడం, ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేకపోవడంతో రానురాను పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏప్రిల్‌లో పందికోన రిజర్వాయర్‌ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు తరలించిన నీటినే ఇప్పటికీ నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇవి కూడా త్వరలోనే ఖాళీ అయ్యే అవకాశముంది. ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించకపోవడంతో చెన్నై కష్టాలను తలచుకుంటూ కందనవోలు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. 

అడుగంటిన సుంకేసుల, జీడీపీ 
కర్నూలు ప్రజల దాహార్తి తీర్చడానికి సుంకేసుల ప్రధాన వనరు. తుంగభద్రపై ఉన్న ఈ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం కేవలం 0.143 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది మహా అయితే ఆరేడు రోజులకు సరిపోతుంది.  ఆలోపు తుంగభద్ర నదికి వరద వస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఎగువభాగంలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర జలాశయానికి సైతం వరదనీటి చేరిక లేక వెలవెలబోతోంది. ఇక రెండో ప్రధాన నీటి వనరు గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ). ప్రస్తుతం దీని నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది కూడా  అడుగంటింది. ప్రస్తుతం 0.117 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు ఐదు రోజులకు మించి చాలదని అధికారులు చెబుతున్నారు.  

రోజు విడిచి రోజు సరఫరా 
కర్నూలు, కోడుమూరు, పాణ్యం.. ఈ మూడు నియోజక వర్గాలకు చెందిన ప్రజలు నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, కోడుమూరు నియోజకవర్గంలోని మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్‌ పురం కాలనీలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలలో పైపులైన్‌ ఇబ్బందుల దృష్ట్యా మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నారు. కర్నూలు నియోజకవర్గ పరిధిలో మాత్రం నిన్నటి వరకు ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేవారు. అయితే..  ప్రస్తుతం నీటి నిల్వలు అడుగంటిపోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించకపోవడంతో నగర పాలక పరిధిలోని అన్ని కాలనీలకు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నట్లు ఎస్‌ఈ వేణుగోపాల్‌ వెల్లడించారు. వర్షాలు రాకపోతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారే అవకాశముందని, కాబట్టి పొదుపు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీరు వృథా కాకుండా చూస్తున్నామని, పబ్లిక్‌ కుళాయిలకు బిరడాలు బిగించామని వివరించారు.

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఎండుతున్నాయి
కర్నూలు నగరవాసులకు వేసవి కాలంలో నీటి కష్టాలు రాకూడదని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. దీని సామర్థ్యం 4,410 మిలియన్‌ లీటర్లు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే నగరానికి 45 రోజుల పాటు సరఫరా చేయొచ్చు. అయితే 2001వ సంవత్సరంలో నిర్మించిన ఈ ట్యాంకులో ఏనాడూ పూర్తిస్థాయిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇందులో ఉన్న నీరు ఆరు రోజులకు మాత్రమే సరిపోతుంది. మొత్తంగా సుంకేసుల, జీడీపీ, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లోని నీరు 20 రోజులకు మించి రాదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న ఆందోళన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  

మరిన్ని వార్తలు