తెలంగాణను పొగుడుతావా?

6 Apr, 2017 20:17 IST|Sakshi
కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, దళిత నేత మద్దయ్య మధ్య వాగ్వాదం

దళితుడిపై కర్నూలు కలెక్టర్‌ సీరియస్‌
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రస్తావనపై మండిపాటు


కర్నూలు(అర్బన్‌): పక్క రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతుంటే మన రాష్ట్రంలో ఒక్క ఇల్లూ కట్టడంలేదన్న దళితుడిపై కలెక్టర్‌ విరుచుకు పడ్డారు. ‘‘మనకు అన్యాయం చేసిన తెలంగాణను పొగుడుతావా? తెలుగు గడ్డ మీద అక్కడి(తెలంగాణ) ప్రస్తావన తీసుకొస్తావా?  ఆంధ్రా, రాయలసీమ రక్తం నాలో ఉంది. ఈ వేదిక మీద ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని కర్నూలు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బుధవారం కర్నూలులో బాబూ జగ్జీవన్‌రామ్‌ 110వ జయంతి ఉత్సవాల్లో దళిత నేత సీహెచ్‌ మద్దయ్య మాట్లాడారు.

పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఇళ్లూ నిర్మించలేదని చెబుతుండగా, కలెక్టర్‌ జోక్యం చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత నేతలు మద్దయ్యకు సంఘీభావం ప్రకటించారు. సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినదించారు. ఆయన పచ్చ చొక్కా వేసుకున్న నాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో కలెక్టర్‌ వెంటనే మైక్‌ కట్‌ చేయించారు.

మైక్‌ ఇవ్వకపోవడంపై మారెప్ప ఫైర్‌
సభ ముగుస్తున్న సమయంలో మాట్లాడాల్సిన నేతల్లో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి మాత్రమే మిగిలారు. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి కేఈకి కలెక్టర్‌ మైక్‌ ఇవ్వడం పట్ల మారెప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాట్‌ ఆర్‌ యూ థింకింగ్‌ అబౌట్‌ మీ.. సే సారీ ’ అంటూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. సారీ చెప్పాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సమాధానం ఇవ్వడంతో కొంతసేపు మాటామాటా పెరిగింది. ‘నేను సమైక్యాంధ్రలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశా. నాకు మైక్‌ ఇవ్వకపోవడం ఏమిటి’’ అని నిలదీశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

మరిన్ని వార్తలు