సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి 

22 Jul, 2019 13:43 IST|Sakshi

2.50 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా 

1,250 కేంద్రాలు గుర్తించాలని తహసీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశం 

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌):  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుండడంతో అందుకు సంబంధించిన రాత పరీక్షల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఒక్కో సచివాలయంలో 11 రకాల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టులకు జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని     అంచనాకు వచ్చిన  రెవెన్యూ యంత్రాంగం.. అందుకు తగ్గట్టు రాత పరీక్ష కేంద్రాలను గుర్తించే పనిలో పడింది. 2.50 లక్షల మంది అభ్యర్థులకు కనీసం 1,250 సెంటర్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ మేరకు సెంటర్లు గుర్తించి సోమవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ వీరపాండియన్‌  అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలను రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌కు పంపి.. ఆమోదం లభించిన వెంటనే పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. 

వీఆర్వో పోస్టుల భర్తీకి కసరత్తు 
గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ శాఖ నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) నియామకానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం మంజూరు (శాంక్షన్‌) అయిన పోస్టులు ఎన్ని? ఎంతమంది పనిచేస్తున్నారు? వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి? రాత పరీక్ష ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే దానిపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో  అర్బన్‌ ప్రాంతాలకు 46, గ్రామీణ ప్రాంతాలకు 746.. మొత్తం 792 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం అర్బన్‌లో 43 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 648 మంది.. మొత్తం 691 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 27 పోస్టులను వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వీఆర్‌ఏలను గుర్తిస్తున్నారు. మిగిలిన 74 వీఆర్వో పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోనే 879 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న సచివాలయాలు రెండింటికి కలిపి ఒక వీఆర్వోను నియమించే దిశగా కసరత్తు సాగుతోంది.   

మరిన్ని వార్తలు